సిసోదియాకు  కస్టడీ పొడగింపు

సిసోదియాకు  కస్టడీ పొడగింపు

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా కు దిల్లీ  కోర్టులో ఊరట లభించలేదు.  ఆయనకు విధించిన కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడగించింది.. మరోవైపు బెయిల్‌ కోసం ఆయన చేసిన పిటిషన్‌పై విచారణను బెయిల్‌ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం 10వ తేదీకి వాయిదా వేసింది.  ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా గత ఆదివారం సీబీఐ  అధికారులు సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు.

ఈ కేసులో న్యాయస్థానం విధించిన 5 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు శనివారం ఆయనను కోర్టు ఎదుట హాజరుపర్చారు. సిసోదియా విచారణకు సహకరించడం లేదని, ఆయనను మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ  అధికారులు కోరారు.  అయితే సీబీఐ వాదనను సిసోదియా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తమకు కావాల్సింది చెప్పించుకునేందుకే కస్టడీని పొడగిస్తున్నారని అన్నారు. కేసు విచారణకు ఆయన సహకరిస్తున్నారని, అయినా సీబీఐ  చెప్పిన మాటే పదే పదే చెబుతోందని దుయ్యబట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సిసోదియా కస్టడీని మరో రెండు రోజులు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం వరకు ఆయన సీబీఐ రిమాండ్‌లోనే ఉండనున్నారు.