కనెక్టివిటీతో అభివృద్ధి

కనెక్టివిటీతో అభివృద్ధి
  • టెలికాం రంగంలో 17  వేల కొత్త ఉద్యోగాలు  
  • 4,5జీ మాడ్యూల్​ లైన్​ను ప్రారంభించిన మంత్రి అశ్విని వైష్ణవ్​

ముంబై: 4జీ, 5జీ కనెక్టివిటీ టెలికం రంగాన్ని, దేశాన్ని అభివృద్ధి దిశలో ముందుకు నడిపిస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ అన్నారు. మంగళవారం గురుగ్రామ్​లోని మానేసర్​లో వర్చువల్​ విధానంలో 4జీ, 5జీ కనెక్టివిటీ మాడ్యూల్​ ప్రొడక్షన్​ లైన్​ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టెలికాం రంగంలో దాదాపు రూ. 2500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామన్నారు. ఇక అమ్మకాల ద్వారా రూ. 3400 కోట్ల ఆర్జించినట్లు మంత్రి వివరించారు. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో ఏకంగా రూ. 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి అంచనా వేశారు. ఇక టెలికాం రంగంలో వచ్చే రోజుల్లో 17 వేల మందికిపైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. యవత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.  భారతదేశానికి చెందిన అనే టెలికాం సంస్థలు సిక్స్‌ సిగ్మా సర్టిఫికేషన్‌ పొందాయని మంత్రి తెలిపారు. టెలికాం రంగం సంస్థలకు ఈ సర్టిఫికేషన్‌ను ఒక గౌరవంగా భావిస్తారు. ఇక రానున్న రోజుల్లో భారత్‌ గ్లోబల్‌ డిజైన్‌, ఇన్నోవేషన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌కు కేంద్ర బిందువు కానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ అభిప్రాయపడ్డారు. 6జీ స్టాండర్డైజేషన్‌ వల్ల టెలికం రంగంలో భారత్‌ ప్రతిష్ట మరింత పెరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.