కూటమితో మోడీ దడ

కూటమితో మోడీ దడ
  • అందుకే పేరు మారుస్తున్నారు
  • బలహీనమైన వారిపై దాడులను పురాణాలు బోధించలేదు
  • ధరలు, దాడులు, కేంద్ర సంస్థలతో బీజేపీ బెదిరింపు
  • ప్యారిస్​లో ప్రధానిపై రాహుల్​ఫైర్​

ప్యారిస్: ఇండియా కూటమిని చూసి బీజేపీ, ప్రధాని మోడీ భయపడుతున్నారని అందుకే దేశం పేరును కాస్త భారత్​గా మార్చి కూటమిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. యూరప్​ పర్యటనలో భాగంగా ప్యారిస్​లోని సైన్సెస్​పో యూనివర్సిటీలో ‘90 మినిట్స్​విత్​రాహుల్​గాంధీ’ అనే కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. తాను బీజేపీ కంటే పెద్ద హిందూత్వ వాదినని అన్ని ఉపనిషత్తులు, గీత, హిందూ పుస్తకాలు చదివానని రాహుల్​ అన్నారు. బీజేపీ మాత్రం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. 

భారత్​లోని అట్టడుగు, నిరుపేద, మధ్యతరగతి వర్గాలు పాలనపై ప్రశ్నిస్తుంటే వారి గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. మరోవైపు మైనారిటీలపై దాడులు పెచ్చుమీరాయన్నారు. భారతదేశంలోని ఇలాంటివారి అభివృద్ధిని బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​లు అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాయని ఆరోపించారు. అట్టడుగు కులాలు, వెనుకబడిన కులాలు మరియు ఇతర మైనారిటీల వ్యక్తీకరణను ఆపడానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. నిజమైన హిందువులు బీజేపీ వారు కాదని రాహుల్​ అన్నారు. బలహీనమైన వారికి హాని కలిగించే ఏ నిర్వచనాన్ని హిందూ పురాణాలు బోధించలేదని అన్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం మాట వినని వారిపై దాడులకు పూనుకుంటోందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను సైతం ప్రయోగిస్తోందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ వారిని నయానో, భయానో తమ దారికి తెచ్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. భారత్​లో 20 కోట్ల మంది ప్రజలు బీజేపీ పాలనతో తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇందులో మైనారిటీలు, సిక్కులు కూడా ఉన్నారన్నారు. మణిపూర్​లో మహిళల పరిస్థితిని ఉద్దేశిస్తూ మహిళలపై కూడా దాడులు జరగడం శోచనీయం, దుర్మార్గమన్నారు. 

మరోవైపు బీజేపీ పాలనలో ధరలు మండిపోతున్నాయని సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. గ్యాస్, పెట్రోల్, డిజీల్​ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్నారు. దేశంలో నిరుద్యోగంతో అనేకమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కళ్లప్పగించి చూస్తోందన్నారు. ఇన్ని సమస్యల మధ్య దేశంలోని హిందూత్వ ఏజెండాతోనే ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​లు దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు చూస్తున్నాయని రాహుల్​గాంధీ ఆరోపించారు. ఇక్కడి నుంచి నేరుగా రాహుల్​గాంధీ నార్వే రాజధాని ఓస్లోకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న వలస కార్యక్రమంలో రాహుల్​ మాట్లాడనున్నారు. 13వ తేదీన రాహుల్​గాంధీ తిరిగి భారత్​కు రానున్నారు.