ఆర్చరీలో చేజారిన గోల్డ్​ మెడల్

ఆర్చరీలో చేజారిన గోల్డ్​ మెడల్

మెక్సికో: ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత ఆర్చర్ ప్రథమేష్ జాకర్‌కు త్రుటిలో గోల్డ్ మెడల్ చేజారింది. మెక్సికోలోని హెర్మోసిలో వేదికగా ఈ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రథమేష్ ఈ పోటీల్లో కూడా అదే జోరు కొనసాగించాడు. అయితే టైటిల్ క్లాష్‌లో అతనికి అదృష్టం కలిసిరాలేదు. దీంతో 20 ఏళ్ల ప్రథమేష్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ప్రథమేష్ 148–-148 పాయింట్లతో ప్రత్యర్థితో సమవుజ్జీగా నిలిచాడు. కానీ డానిష్ ప్లేయర్ మథియాస్ ఫుల్లర్టాన్‌కు అదృష్టం కలిసొచ్చింది. అతను వేసిన బాణం 'ఎక్స్' గుర్తుకు దగ్గరగా ఉంది. ఇద్దరికీ సమానమైన పాయింట్లు ఉన్నా కూడా.. ప్రథమేష్ బాణానికి 'ఎక్స్' గుర్తుకు కొంచెం ఎక్కువ దూరం ఉంది. దీంతో మథియాస్‌ను విజేతగా నిర్ణయించారు. అతను గోల్డ్ మెడల్ సాధించగా.. ప్రథమేష్ సిల్వర్ మెడల్ అందుకున్నాడు. ఈ టోర్నీలో మంచి ఫామ్ కనబరిచిన ప్రథమేష్ స్థానిక ఫేవరెట్ మిగుల్ బెకెరాను క్వార్టర్స్‌లో 149–-141 పాయింట్ల తేడాతో ఓడించి సెమీఫైనల్ చేరుకున్నాడు.

అలాగే సెమీఫైనల్‌లో వరల్డ్ నెంబర్ వన్ మైక్ స్క్లోజర్‌ను 150–-149 తేడాతో ప్రథమేష్ ఓడించాడు. ఈ సీజన్‌లో వరల్డ్ నెంబర్ వన్‌ను ఓడించడం ప్రథమేష్‌కు ఇది రెండోసారి కావడం గమనార్హం. అదే సమయంలో మరో భారత ప్లేయర్ అభిషేక్ వర్మను 150-–147 తేడాతో ఓడించిన ఫుల్లర్టాన్.. ఫైనల్‌ చేరుకున్నాడు. ఫైనల్ మొదటి రౌండ్‌లో ఒక పాయింట్ వెనుకబడిన ప్రథమేష్ ఆ తర్వాత పుంజుకొని నాలుగో రౌండ్‌లో 119-–119తో పాయింట్లు సమం చేశాడు. ఇలా ఇద్దరి స్కోర్లు టై అవడంతో టైబ్రేకర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇక కాంస్యం కోసం జరిగిన పోటీలో అనుభవం ఉన్న అభిషేక్ వర్మ ఆరంభంలో పైచేయి సాధించాడు. కానీ చివర్లో స్క్లోజర్ అద్భుతంగా పుంజుకోవడంతో తడబడ్డాడు. ఈ మ్యాచ్‌లో 150-–149 తేడాతో అభిషేక్ ఓటమి పాలయ్యాడు. దీంతో స్క్లోజర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ అదితి స్వామి, జ్యోతి సురేఖ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంటిముఖం పట్టారు. కొలంబియా స్టార్ సారా లోపెజ్ మహిళల ఫైనల్ నెగ్గింది.