భారత్​–పాక్​ మ్యాచ్​కు సై 

భారత్​–పాక్​ మ్యాచ్​కు సై 
  • ఓపెనర్​గా బరిలోకి గిల్​

అహ్మదాబాద్: భారత్​ – పాకిస్థాన్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్ పూర్తి కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అహ్మదాబాద్‌లో గురువారం ప్రాక్టీస్ షురూ చేసిన శుభ్‌మన్ గిల్.. పాక్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. మరోవైపు అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియా.. గురువారమే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయల్దేరింది. శుక్రవారం ప్రాక్టీస్ చేసి శనివారం మ్యాచ్ ఆడనుంది. టీమిండియా ఇంకా అహ్మదాబాద్ చేరుకోకున్నా.. శుభ్‌మన్ గిల్ తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందే డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్ చెన్నై వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి పోరుతో పాటు అఫ్గాన్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ రక్తకణాల సంఖ్య లక్షలోపు పడిపోవడంతో అతన్ని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. దాంతో అతను టీమిండియాతో ఢిల్లీకి వెళ్లలేదు. చెన్నైలోనే ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం చెన్నై నుంచి కమర్షియల్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్ చేరుకున్నాడు.

రక్తకణాల సంఖ్య మెరుగవ్వడంతో పాటు కాస్త ఫిట్‌గా మారడంతో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. శనివారం టీమిండియాతో ప్రాక్టీస్ చేసిన అనంతరం అతన్ని ఆడించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేసిన విధానం చూస్తుంటే శనివారం తప్పకుండా మ్యాచ్ బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అహ్మదాబాద్ మైదానం శుభ్‌మన్ గిల్‌కు అచ్చొచ్చిన గ్రౌండ్. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న గిల్‌కు ఇదే హోమ్ గ్రౌండ్. ఇక్కడ అతనికి మంచి రికార్డు ఉంది. అచ్చొచ్చిన మైదానంలో పాకిస్థాన్‌పై శుభ్‌మన్ గిల్ చెలరేగుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌పై సాధించిన విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది. మరోవైపు పాకిస్థాన్ సైతం నెదర్లాండ్స్, శ్రీలంకపై విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. శనివారం ఇరు జట్ల మధ్య ఆసిక్తకర పోరు ఉండనుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ.. ఆరంభ వేడుకలను నిర్వహించనుంది. బాలీవుడ్ స్టార్స్‌తో ఆట, పాటల కార్యక్రమం నిర్వహించనుంది.కాగా భారత్​ –పాక్​ మ్యాచ్​కు వరుణుడు ఆటంకం కల్పించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు భారత్​–పాక్​ మ్యాచ్​లు వీక్షించే అవకాశాన్ని కోల్పోయారు. తాజాగా మరోమారు హెచ్చిరికలతో వరుణుడి ఆటంకంపై క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.