సద్దుమణిగిన కోహ్లీ–ఉల్​ గొడవ

సద్దుమణిగిన కోహ్లీ–ఉల్​ గొడవ
  • సంతోషం వ్యక్తం చేసిన గంభీర్

​న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య భేదాభిప్రాయాలు, గొడవలను పక్కనపెట్టి కలిసిపోయారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా మైదానంలో ఈ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వాగ్వాదం పెద్దదిగా మారి ఒకరిపై మరొకరు దూసుకెళ్లే వరకు వెళ్లింది. సోషల్ మీడియా వేదికగా కూడా మాటల యుద్దం నడిచింది. చివరకు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య కూడా వాగ్వాదం జరిగేలా చేసింది. ఈ విషయాన్ని కోహ్లీ వదిలేసినా.. నవీన్ ఉల్ హక్ విడిచిపెట్టలేదు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీని రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టాడు. కోహ్లీ పట్టించుకోకపోయినా అతని ఫ్యాన్స్ మాత్రం నవీన్ ఉల్ హక్‌ను వదిలేయలేదు. అతను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కోహ్లీ పేరుతో నామస్మరణ చేస్తూ అతనిపై ట్రోలింగ్‌కు దిగారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే భారత్-అఫ్గాన్ పోరు అనగానే అందరూ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య పోరుగా భావించారు. కానీ ఈ ఇద్దరూ కలిసిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేయవద్దని కోహ్లీ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇక నవీన్ ఉల్ హక్ సైతం కోహ్లీ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న గొడవను ఆపేద్దామని కోహ్లీ కోరగా.. నవీన్ ఉల్ హక్ ఒప్పుకున్నాడు. అనంతరం నవ్వుతూ ఇద్దరూ హగ్ చేసుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన గంభీర్.. ఈ ఘటనపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ' ఏ ఆటగాడైనా మైదానంలోనే పోరాడాలి. ఫీల్డ్ బయట కాదు. ప్రతీ ఒక్క ప్లేయర్‌కు తమ జట్టు విజయం కోసం పోరాడే హక్కు ఉందని అన్నాడు.