ఇమడ లేక! బయటకు రాలేక!!

ఇమడ లేక! బయటకు రాలేక!!
  • బీజేపీలో వలస నేతలు ఉక్కిరిబిక్కిరి
  • పాత, కొత్త నేతల మధ్య పొడసూపిన విభేదాలు
  • అయినా, సీరియస్ గా తీసుకోని అధిష్టానం
  • రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారనే చర్చ
  • తగిన నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే భావన
  • అందరూ మాతృపార్టీలలో కీలక పదవులు నిర్వహించినవారే
  • కమలదళంలో తగిన గుర్తింపు దక్కలేదనే ఆవేదన
  • బయటకు రావాలంటూ అనుచరుల ఒత్తిడి
  • భవిష్యత్ అడుగుల కోసం ఎదురుచూపులు
  • ఈటల, వివేక్, కొండా, ఏలేటి, బూర రాజకీయ భవితవ్యంపై చర్చ

వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వలస నేతల రాజకీయ భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సొంత పార్టీలో విభేదాలు, ఆధిపత్యపోరును తట్టుకోలేక కాషాయ కండువా కప్పుకున్న సీనియర్​నేతలు బీజేపీలోనూ ఇమడలేక పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాతృపార్టీలలో ఉన్నపుడు ఓ వెలుగు వెలిసిన ఆయా లీడర్లకు ఇప్పుడు బీజేపీలో ఆదరణ కరువైందనే అసంతృప్తి ఆయా నేతలతో పాటు వారి అనుచర వర్గాలలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీజేపీలో నేతల మద్య విభేదాలు వెలుగుచూడడం ఆ పార్టీలో సీనియర్ల మద్య నెలకొన్న అసంతృప్తిని తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో వారి రాజకీయ భవితవ్యం మీద రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వీరిని వినియోగించుకుని ఉంటే
నిజానికి గత కొంత కాలంగా వరుసగా బీజేపీలో చేరుతూ వచ్చిన నేతలంతా ఆయా పార్టీలలో చురుకుగా వ్యవహరించినవారే. కీలక పదవులను కూడా నిర్వహించినవారే. దీంతో పార్టీకి మంచి ఊపు వచ్చినట్టుగా కనిపించింది. ఒక దశలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీజేపీ సీన్ లోకి వచ్చిందని, బీఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీగా ఎదుతోందనే అభిప్రాయమూ వినిపించింది. ఈ క్రమంలో వలస నేతలను సరిగా వినియోగించుకోగలిగితే బీజేపీకి మేలు జరిగి ఉండేదని ఆ పార్టీ అభిమానులు చెబుతున్నారు. కానీ, పాత, కొత్త నేతల మధ్య పొడసూపిన అభిప్రాయభేదాలతో ఇపుడు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇదే సమయంలో కర్ణాటక ఫలితాలు రాష్ట్ర బీజేపీ నేతలను మరింతగా నిరాశపరిచాయి. 

ముద్ర, తెలంగాణ బ్యూరో:
 ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్​గా ఉన్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్​ఆవిర్భావం నుంచి కేసీఆర్​వెంటే ఉన్నారు. హుజూరాబాద్, కమలాపూర్​నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి కేబినెట్​లో ఆర్థిక, పౌరసరఫరాలు, తూనికలు కొలతల శాఖ మంత్రిగా పని చేసిన ఆయన 2019 ఎన్నికల తర్వాత వైద్యారోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. తదనంతర పరిణామాలలో కేసీఆర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. అంతకు ముందు ‘గులాబీ జెండాకు మేమూ ఓనర్లమే’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈటల కొత్త పార్టీ పెడతారనే వరకు వ్యవహారం వెళ్లింది. చివరకు బీఆర్ఎస్​పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికలో హుజూరాబాద్​ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ విజయాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్నప్పటికీ, ఆ గెలుపు ఈటలదే అనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది.  ఎందుకో తెలియదుగానీ, ముందు నుంచే ఈటలకు, బీజేపీ స్టేట్ చీఫ్ కు మధ్య పొసగలేదు. ఇద్దరు నేతలు దీనిని ఖండించినప్పటికీ, అనేక సందర్భాలలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. పార్టీలో ముందు నుంచి ఉన్నవారు ఒక గ్రూప్ గా, వలస వచ్చిన నేతలు మరో గ్రూప్ గా ఉన్నారనే ప్రచారమూ జరిగింది. కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ వంటి వారు ఈ విషయంలో మౌనంగానే ఉండిపోయారు. దీంతో పార్టీలో ఏదో జరుగుతోందనే చర్చకు ఆస్కారం కలిగింది. మరో వైపు పార్టీ నుంచి బయటకు రావాలని ఈటలపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

ఆవేదనలో వివేక్
పెద్దపల్లి జిల్లాకు చెందిన సీనియర్​నాయకుడు వివేక్ సైతం బీజేపీలో తనకు ఆశించిన ఆదరణ అంతగా లేదనే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, కాంగ్రెస్​కురువృద్ధుడు వెంకటస్వామి వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చిన ఆయన 2009లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో బొగ్గు, ఉక్కు కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరిన సమయంలో 2 జూన్‌ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్​లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరి అదే యేడాది పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో బీఆర్‌ఎస్‌ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికలలో బీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో 25 మార్చి 2019న ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆగష్టు 2019న బీజేపీలో చేరారు. 7 అక్టోబర్ 2021న భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితుడై కొనసాగుతున్నారు. ఇపుడు వివేక్ కూడా సందిగ్ధంలో ఉన్నారని చెబుతున్నారు. పార్టీ కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా సరైన గుర్తింపు రాలేదనే భావనలో ఆయన ఉన్నారని చెబుతున్నారు. దీంతో వివేక్ త్వరలోనే కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

మాగతా నేతలు కూడా
చివ్వెంలకు చెందిన సీనియర్​ నాయకుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి సైతం బీజేపీలో సరైన ఆదరణకు నోచుకోవడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఉంది. 2018 నవంబర్​21న కాంగ్రెస్ లో చేరిన కొండా 2021 మార్చిలో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ముందు కొంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో సైలెంట్ గానే ఉంటున్నారు. కవిత విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయేమోనని ప్రజలు అనుమానపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్టు చేయకపోవడంతో బీజేపీపై నమ్మకం సన్నగిల్లిందనే విధంగా మాట్లాడారు. 

నిర్మల్​జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడిగా పని చేసిన మరో ముఖ్యనేత ఏలేటీ మహేశ్వర్​రెడ్డి ఇటీవలి కాలంలోనే బీజేపీలో చేరారు. ఆయన కూడా తనకు ఆశించిన ఆదరణ లభించడం లేదనే ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. ఈ యేడాది ఏప్రిల్​14న బీజేపీలో చేరిన ఆయనకు ఆ పార్టీలో ప్రస్తుతం ఏ పోస్టు లేదు. సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ ఎంపీ బూర వెంకటనర్సయ్య సైతం బీజేపీలో కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వృత్తిరీత్యా వైద్యుడైన నర్సయ్య, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌లో 2013 జూన్‌ 2న చేరి, 2014 లోక్‌సభ ఎన్నికలలో భువనగిరి లోక్​సభ స్థానం నుండి గెలిచారు. 2022 అక్టోబర్ 15న ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 2022 అక్టోబర్ 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ ఛుగ్‌, బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు. రానున్న రోజుల్లో వీరి నిర్ణయం ఎలా ఉంటుంది.? వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారోననే చర్చ జరుగుతోంది.