‘లక్ష’ పథకానికి నేడే శ్రీకారం

‘లక్ష’ పథకానికి నేడే శ్రీకారం
  • కులవృత్తులు,  చేతి వృత్తులవారికి ఆర్ధిక చేయూత
  • మంచిర్యాలలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా
  • పంపిణీకి అంతా సిద్ధం చేసిన అధికారులు
  • అర్హులకే అందేలా సర్కారు మార్గదర్శకాలు
  • 18 నుంచి 55 యేళ్ల వారికి మాత్రమే అవకాశం
  • లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్


ముద్ర, తెలంగాణ బ్యూరో: మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంచిర్యాలలో శుక్రవారం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నాయీ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసలతోపాటు మరిన్ని కులాలను ఇందుకోసం గుర్తించారు. ప్రతి నియోజకవర్గంలో 1,200 నుంచి 1,500 మందికి లబ్ధి చేకూర్చేలా కసరత్తును పూర్తి చేశారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. కుల, చేతి వృత్తులకు సంబంధించిన పని ముట్లు, ముడి సరకు కొనుగోలుకు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అర్హులైన లబ్ధిదారులకు కూడా స్థానిక మంత్రులు, శాసనసభ్యలు లబ్ధాదారులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. దరఖాస్తు దారులంతా  ఈ వెబ్ సైట్ ద్వారా తమ వివరాలను  అందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏయే కులాలను పరిగణనలోకి తీసుకోవాలి? సొమ్మును సాయంగా ఇవ్వాలా లేదా రుణం రూపేణా  ఇవ్వాలా?  లేక మొత్తం సబ్సిడీ రూపంలో ఇవ్వాలా అనే అంశాలపై  కూలంకషంగా చర్చించిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. గ్రామాలలో  రూ.1.50 లక్షల లోపు, పట్టణాలలో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించింది. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది.