లీకు కుట్ర బీజేపీదే

లీకు కుట్ర బీజేపీదే
  • నిందితులు బీజేపీ యాక్టివ్​ కార్యకర్తలు
  • లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటం
  • రాజకీయాల కోసమే ఇలాంటి వ్యూహాలు
  • మండి పడిన ఐటీ మంత్రి కేటీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో :
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాప‌త్రాల లీక్ కుట్ర ముమ్మాటికీ బీజేపీదే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందన్నారు. రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి పేపర్‌ను లీక్ చేయించారని మండిపడ్డారు. శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడిందన్నారు. యువత భవితతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ త‌న‌పై వస్తున్న విమ‌ర్శల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. బండి సంజయ్ విష‌య ప‌రిజ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న సంజయ్ తెలివేమిటో తేలిపోయిందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారన్నారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహిత, నిరాధార ఆరోపణలు చేసి పరువునష్టం కేసు ఎదుర్కుంటున్నారన్నారు. ఈసారి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని, రానున్న రోజులలో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కువ
బీజేపీ పాలిత అనేక రాష్ట్రాలలో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందలలో ఉన్నాయని కేటీఅర్ తెలిపారు. స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే ఎనిమిదేండ్లలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై ఏమంటారని నిలదీశారు. ప్రధానమంత్రి మోడీని బాధ్యున్ని చేసి ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలోనూ బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుస‌న్నారు. కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే, పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలన్న బండి సంజయ్‌కు అసలు యువత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఒకరు చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం కమిషన్ నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందన్నారు.