కుటుంబ పార్టీలతో తెలంగాణకు అన్యాయం 

కుటుంబ పార్టీలతో తెలంగాణకు అన్యాయం 
  • కాశేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు అవినీతిమయం
  • బీజేపీకి మాత్రమే సిద్ధాంతం ఉంది
  • కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, మజ్లిస్​ ఒకే గూటి పక్షలు
  • కేటీఆర్​ను సీఎం చేసేందుకు...  
  • కవిత జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకు కేసీఆర్​ పాట్లు 
  • మేధావుల సదస్సులో కేంద్రమంత్రి అమిత్​ షా

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చారని, కాళేశ్వరం, పాలమురు–రంగారెడ్డి ప్రాజెక్టులతో దోచుకున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా మండిపడ్డారు. నగరంలోని ఇంపీరియల్​ గార్డెన్​లో మేధావులతో నిర్వహించిన సదస్సులో అమిత్​ షా మాట్లాడారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదని, బీజేపీ మాత్రమే సిద్దాంతానికి అనుగుణంగా నడుస్తుందని, బీఆర్​ఎస్​కు ఏం విధానం ఉందని, మొత్తం కుటుంబ పార్టీ అని ఆరోపించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని, తెలంగాణలో పదేళ్ళు అవినీతిలో మునిగిపోయిన బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దని కోరారు. రానున్న ఐదేళ్ళు మంచి పాలన ఎవరు ఇవ్వగలరో తెలంగాణ సమాజం ఆలోచించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు అని, కుటుంబ, అవినీతి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను తమ పార్టీ పక్కన కూర్చోపెట్టుకోబోమని షా స్పష్టం చేశారు.

మజ్లిస్ తో కలసి ప్రభుత్వాన్ని నడుపుతోన్న కేసీఆర్ ను బీజేపీ దగ్గరకు రానివ్వదని, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకేగూటి పక్షులు అని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ చెప్పిన నీళ్ళు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణ ప్రజలు తమ ఓటును ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరారు., తొమ్మిదేళ్ళల్లో తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ. 9 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ తెలంగాణలో అధికారికంలోకి రాగానే గ్రామగ్రామాన తెలంగాణ విమోచన దినోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తామని, భారతీయ జనతా పార్టీకి అవకాశమిస్తే తెలంగాణను అభివృద్ధిలో ముందుంచుతామని అమిత్​ షా వెల్లడించారు.  ప్రధాని మోడీ నేతృత్వంలో దేశాన్ని సురక్షితంగా ముందుకు తీసుకెళ్తున్నామని, కోవిడ్​ ను సమర్థంగా ఎదుర్కొన్నామని అన్నారు. రాష్ట్ర పార్టీ నేతలు కలిసికట్టుగా ఉండి, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేయాలని, గెలిచే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఇది అమృత కాలం అని, సంకల్పం తీసుకోవాల్సిన సమయం అని అమిత్​ షా పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.