మద్యం షాపుల  లక్కీ డ్రా షూరూ!

మద్యం షాపుల  లక్కీ డ్రా షూరూ!
  • అంబర్ పేట్ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న డ్రా 
  • 2,620 వైన్​షాపులకు లక్షకు పైగా దరఖాస్తులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా కేటాయించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రాను పకడ్బందీగా నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధీనంలో లక్కీ డ్రా ప్రక్రియ జరగుతోంది. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో మద్యానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ప్రతి లక్కీ డ్రా సెంటర్లో దరఖాస్తుదారులు పోటెత్తారు. ఇందులో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పాసులు జారీ చేసిన వారికి మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిచ్చారు. లక్కీ డ్రా కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లోని అంబర్ పేట్, రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న లక్కీ డ్రా ప్రక్రియకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. 

  • సరూర్ నగర్ లో 10,908 దరఖాస్తులు..

2023–2025 మద్య పాలసీకి సంబంధించి కొత్త షాపులకు ఏర్పాటకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, 18న ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 వైన్ షాపులు ఉండగా, లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా సరూర్ నగర్ లో 10,908 దరఖాస్తులు రాగా, అతి తక్కువగా అసిఫాబాద్ లో 967 దరఖాస్తులు వచ్చాయి. వీటిద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ.2 లక్షలు వసూలు చేసింది. ఒకవేళ లక్కీ డ్రాలో పేరు రాకపోతే రూ.2 లక్షలు ప్రభుత్వానికే వెళ్లిపోతాయి.