సర్కారువారి ‘ఇంటి’ పాట్లు

సర్కారువారి ‘ఇంటి’ పాట్లు
  • నాడు ‘డబుల్’ ఇండ్లు.. నేడు ‘సొంత జాగా’
  • రెండు పథకాలకు నిధులే అసలు సమస్య
  • ’మూడు లక్షలు’  ఇవ్వాలంటే 2 వేల కోట్లు కావాలి
  • ఖజానా ఆదాయం రోజువారీ ఖర్చులకే సరి
  • పాత జాయింట్​వెంచర్ల మీదనే ఇక ఆశలు
  • సంస్థలతో  రాయ‘బేరా’నికి దిగిన ప్రభుత్వం
  • కొత్త పథకంలో కీలక మార్పులకు నివేదిక
  • ఈ యేడాది జూన్​ వరకు తొలి జాబితా?
  • నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం
కొత్త పథకానికి ఆరంభంలోనే కాసుల కష్టాలు మొదలయ్యాయి. సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ లో దాదాపు 11 వేల కోట్లను కూడా  కేటాయించింది. కానీ, దీనిని అమలులో పెట్టేందుకు ఖజానాలో కాసులు కనిపించడం లేదు.  వస్తున్న ఆదాయంలో  సింహభాగం రోజువారీ ఖర్చులకే సరిపోతున్నాయి. దీంతో పాత భూములే ఇపుడు చిరుదీపంలా కనిపిస్తున్నాయి. కనీసం రూ. రెండు వేల కోట్లను కొత్త పథకంలో ఖర్చు చేయాలని, వాటిని సదరు భూముల నుంచి రాబట్టుకోవాలని సర్కారు భావిస్తోంది. నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్​సబ్​ కమిటీ సోమవారం భేటీ కానున్నది. 
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఇండ్ల నిర్మాణ పథకాలు కేసీఆర్​ సర్కారుకు కలిసి రావడం లేదు. ఏడేండ్ల నుంచి డబుల్​ బెడ్​ రూం ఇండ్ల పథకం సాగుతూనే ఉంది. అనుకున్న లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా పంపిణీ చేయలేదు. దీనిపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో కొత్త పథకాన్ని ప్రకటించారు. సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ. మూడు లక్షల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. బడ్జెట్లో నిధులు కేటాయించారు. తీరా సమయానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలో ఆర్థిక శాఖకు తోచడం లేదు. ఈ పథకం కోసం అప్పు కూడా రాదు. ఆల్రెడీ డబుల్​ ఇండ్ల పథకం పేరుతో రూ. 10,800 కోట్ల అప్పు తీసుకున్నారు. ఇంకా పట్టాలెక్కని కొత్త పథకానికి రుణం రావడం కష్టమే. సర్దుబాటు అనివార్యంగా మారింది. వాస్తవానికి 2014 నుంచి పేదలకు ఇండ్ల పంపిణీ ఆగిపోయింది. అనుకున్న స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేక పోవడంతో 2019 ఎన్నికల హామీలో భాగంగా సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని టీఆర్ఎస్ మానిఫెస్టోలో పొందుపరిచింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో లక్ష ముంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసేందుకు రూ. 11,917 కోట్లు కేటాయించింది.  వాణిజ్య పన్నులు, ఎక్సైజ్​, రిజిస్ట్రేషన్ల నుంచి ఈ యేడాది ఫిబ్రవరి వరకు వచ్చిన రూ. 98,140 కోట్లను జీతభత్యాలు, నిర్వహణ, సీఎం, మంత్రుల ఖర్చులకు వెచ్చించారు. సొంత రాబడి ఆశించినంతగా పెరగడం లేదు. దీంతో కేసీఆర్ సర్కారు ప్రకటించిన కొత్త పథకానికి నిధులను సర్దుబాటు చేయడం ఆర్థిక శాఖకు సవాల్​ గామారింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్​సబ్​ కమిటీ సోమవారం భేటీ కానున్నది. 
పాత భూములపైనే ఆశలు
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్థలాలను డెవలప్​మెంట్​ కోసం పలు కంపెనీలకు వందల ఎకరాలను కట్టబెట్టారు. వీటిలో ఏపీకి చెందిన చాలా సంస్థలున్నాయి. జగన్ కు చెందిన ఇందూ, సృజనా చౌదరికి చెంది సృజనా ఫోరం, రోశయ్య కుటుంబానికి చెందిన మంజీరాతో పాటుగా అరణ్య, డీహెచ్ఎల్​వంటి 16 సంస్థలకు నగర శివారులో భూములిచ్చారు. ఈ భూములలోనే మంజీరా మాల్​, సృజనా ఫోరం, డీహెచ్​ఎల్​ అపార్ట్​మెంట్స్​ వంటి నిర్మాణాలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ సంస్థలు తీసుకున్న భూములను డెవలప్​చేసుకుని ఐదు శాతం ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఒక్క సంస్థ కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు. దీనికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉన్న ప్రభుత్వాలు కూడా కారణమే. నిర్మాణాలు చేసిన సంస్థలన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు కావాల్సిన సంస్థలు కావడంతో ఇప్పటిదాకా చూసీచూడనట్లుగా వ్యవహరించారు. కానీ, ఇప్పుడు హౌసింగ్​ బోర్డు భూములపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. 
అమ్మితేనే కొత్త స్కీంకు పైసలు
హౌసింగ్​ బోర్డు భూములను అమ్మడం, జాయింట్ వెంచర్లను క్లియర్​ చేస్తేనే ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పథకం పట్టాలెక్కనున్నది. దీనిలో భాగంగా 16 జాయింట్​ వెంచర్ల నుంచి రూ. రెండు వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో సంస్థ సుమారు రూ. 150 నుంచి రూ. 250 కోట్ల వరకు బాకీ ఉన్నాయి. ఇవన్నింటినీ వచ్చేనెలలోగా వసూలు చేసుకోవాలని భావిస్తున్నారు. అన్ని సంస్థలకూ నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు, మూడు నెలలలో వసూలు చేసుకున్న తర్వాత, సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పథకం మొదలుకానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే కేబినెట్​ సబ్​ కమిటీ సోమవారం భేటీ అవుతున్నది. 
జూన్​ తర్వాత నుంచే ఎంపిక
ఈ కొత్త పథకాన్ని విడుతల వారీగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంటి నిర్మాణం ఉంటే రూ. 3 లక్షల ఆర్ధిక సాయం చేసే పథకాన్ని ముందుగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల చొప్పున ఇవ్వాలని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సంఖ్య వెయ్యికు చేరింది. బడ్జెట్​ లో కూడా ఈ మేరకే నిధులు కేటాయించారు. అయితే, ఒకేసారి లక్ష ఇండ్లకు మంజూరు చేయాలంటే.. నిధులు సమస్య వచ్చి, బిల్లులు పెండింగ్​ పడుతాయని, దీంతో లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. ఈ నేపథ్యంలోనే విడుతలు వారీగా ఇచ్చేందుకు ప్రతిపాదనలు పెట్టారు. అంటే ఒక విడుతలో లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి మంజూరు చేసి, నిర్మాణాలు మొదలై.. పునాదులు పడే వరకు ఒక్కో బిల్లును విడుదల చేయనున్నారు. ఈ విడుతలో కనీసం పునాదుల వరకు బిల్లులు కంప్లీట్​ చేస్తేనే.. రెండో విడుతలో మరింత మంది లబ్ధిదారులకు మంజూరు చేయనున్నారు. ఈ లెక్కన ప్రతి మూడునెలలకోసారి రూ. 200 నుంచి రూ. 300 కోట్ల వరకు ఇవ్వాలని, ఇలాగైతే లబ్ధిదారులు నిర్మాణాలు సకాలంలో చేయడం లేదనే సాకుతో పాటుగా ఒకేసారి ఇచ్చే నిధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఉన్నతాధికారుల బృందం సూచించింది. 
సొంతంగానే
ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేందుకు సర్కారు దగ్గర ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అందుకే వెయ్యికి తగ్గించారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఏవై అర్బన్​ కింద వచ్చే నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి ఇంటి నిర్మాణ పథకాన్ని ప్రకటించారు. దీనికోసం 1.69 లక్షల పీఎంఏవై అర్బన్​పథకంలో ఇండ్లను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. కానీ, పాత కథ ముందు పడింది. గతంలో ఇచ్చిన ఇండ్లకు యూసీలు, లబ్ధిదారులు జాబితా ఇవ్వలేదని కేంద్రం రాష్ట్రానికి నిధులు ఆపేసింది. 1.69 లక్షల ఇండ్లకు ముందుగా లబ్ధిదారుల జాబితా ఇస్తేనే మంజూరు ఇస్తామని స్పష్టం చేసింది. కానీ, రాష్ట్రం దగ్గర జాబితా లేకపోవడంతో ఈ పథకం రాదని తేలిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అందుకే నియోజకవర్గానికి ముందుగా వెయ్యి మాత్రమే పరిమితం చేశారు.