షర్మిలకు సంస్కారం ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి..

షర్మిలకు సంస్కారం ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి..

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి సీతమహాలక్ష్మి డిమాండ్..

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏమాత్రం సంస్కారం ఉన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆమె తల్లి విజయమ్మ ఎలాంటి సంస్కారం నేర్పిందో షర్మిల అంత దారుణంగా మాట్లాడుతుందన్నారు. హిందూ వివాహవ్యవస్థనే అవమానపరిచే విధంగా షర్మిల వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణలను షర్మిల నిరూపించాలని, లేదంటే ఎమ్మెల్యేతో పాటు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు.

వ్యక్తిగతంగా తన పేరును ప్రస్తావించడం పట్ల సీతామాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఒక వైద్యురాలిగా అనేక సంస్థల్లో తాను పనిచేస్తున్నానని, మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేస్తున్న కార్యక్రమాలను పరిశీలిస్తున్న ప్రజలు షర్మిల వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారకూడదని ఆలోచనతోనే.. ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలను అదుపు చేసే మంచి ఉద్దేశంతోనే తాను నిరసన కార్యక్రమం జరుగుతున్న చోటికి వెళ్ళానన్నారు. ఇప్పటికైనా షర్మిల చేసిన తప్పును తెలుసుకోవాలని మాట్లాడే ముందు షర్మిల మహిళా జాతికి ఇబ్బంది కల్పించే విధంగా మాట్లాడడం మానుకోవాలని హితువు పలికారు. క్షమాపణ చెప్పాలన్నదే నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్న ఏకైక డిమాండ్ అని షర్మిల పరిస్థితిని అర్థం చేసుకోవాలని డాక్టర్ సీతామాలక్ష్మి తెలిపారు.