ఉద్యమ ద్రోహులకే పెద్ద పీట!

ఉద్యమ ద్రోహులకే పెద్ద పీట!

ఇకనైనా ఉద్యమకారులను గుర్తించాలి
కేసముద్రం, ముద్ర: తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యమ ద్రోహులకే పెద్ద పీట దక్కిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ సాధన కోసం మలిదశ ఉద్యమం సాగించిన ఉద్యమకారులను గుర్తించాలని ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు చాగంటి కిషన్, బొమ్మన బోయిన అనసూర్య డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం మలిదశ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో మలిదశ ఉద్యమకారులను భాగస్వాములను చేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధి కేటాయించి ప్రతి నెల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే తెలంగాణ ఉద్యమ ద్రోహులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని, తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులు కేసులపాలై అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్ గా కొలిపాక వెంకన్న, సెంట్రల్ కమిటీ కన్వీనర్ గా తోట సుధాకర్, కో కన్వీనర్లుగా అనసూర్య, సూరయ్య, పరమేశ్వర్, య, లక్ష్మణ్, గౌరవ సలహాదారుగా నరసింహారెడ్డి, వెంకటయ్య, కృష్ణారెడ్డి, ఉప్పల్ రెడ్డిలను ఎన్నుకున్నారు.