గులాబీలో మల్లారెడ్డి ప్రకంపనలు

గులాబీలో మల్లారెడ్డి ప్రకంపనలు

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి ప్రకటించిన ఎమ్మెల్యేలు తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మామూలుగా అయితే ఇలా గ్రూప్‌ గా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోడాన్ని  ఎవరూ పట్టించుకోరు కానీ.. అంతకు ముందే వరుసగా రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు .. అసంతృప్తి వ్యక్తం చేసి వెంటనే... కలసికట్టుగా టూర్‌ ప్లాన్‌ చేసుకోవడంతో..ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడిరది.అయితే ఆ ఎమ్మెల్యేలు తిరుమల శ్రీవారి కొండపై ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మైనంపల్లి హన్మంతరావుతో పాటు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేక్‌, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి వంటి వారు ఉన్నారు.ఈ నలుగురు కాకుండా.. మల్లారెడ్డిపై కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా మల్లారెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. 

మల్లారెడ్డిపై ఇలా వరుసగా ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. మామూలుగా  ప్రాంతీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు ఇలా గుట్టుగా సమావేశం నిర్వహించడాన్ని హైకమండ్‌ అసలు ఉపేక్షించదు. వెంటనే వార్నింగ్‌ ఇస్తుంది. కానీ ఇక్కడ మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో సాగిన సమావేశంపై బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ పెద్దగా స్పందించలేదు. దీంతో మల్లారెడ్డినే తర్వాతి రోజు విూడియాతో మాట్లాడారు. మాది కుటంబ సమస్య అని.. ఎమ్మెల్యేలందరితోనూ మాట్లాడతానన్నారు. అవసరమైతే వారిని ఇంటికి పిలుస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే బీఆర్‌ఎస్‌లో మల్లారెడ్డి తీరుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ కూడా ఆయన తీరుపై అసంతృప్తితో ఉందని చెబుతున్నారు. ఆయనపై ఎమ్మల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడానికి పరోక్షంగా హైకమాండ్‌ సూచనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు మంత్రిపై ఘాటు విమర్శలు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నించలేదని.. మల్లారెడ్డి వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకున్న హైకమాండ్‌.. చెక్‌ పెట్టేందుకు ఎమ్మెల్యేల్ని ప్రోత్సహించిందన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. 

మల్లారెడ్డికి చెందిన ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున అక్రమాలను గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డికి పదుల సంఖ్యలో ఇంజినీరింగ్‌ కాలేజీలు, మెడికల్‌ కాలేజీలతో పాటు పెద్ద ఎత్తున  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉంది. వందల ఎకరాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది ఈ క్రమంలో ఆయన విషయాన్ని ఐటీ అధికారులు ఈడీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సిఫార్సు చేశారు. అయితే ఈడీ ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మామూలుగా అయితే వెంటనే ఈడీ రంగంలోకి దిగి ఉండేది. మల్లారెడ్డి కూడా విూడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. తెర వెనుక తనను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని..ఈ విషయం హైకమాండ్‌కు తెలిసిదని చెబుతున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి రాజకీయం  బీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.