టీఎస్​పీఎస్సీ  బోర్టు సభ్యులను సస్పెండ్​చేయండి

టీఎస్​పీఎస్సీ  బోర్టు సభ్యులను సస్పెండ్​చేయండి
  • కేటీఆర్​ను విచారణ కోసం ఆదేశించండి
  • గవర్నర్​ను కోరిన టీ పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి
  • న్యాయ సలహాలు తీసుకుంటానన్న తమిళిసై

ముద్ర, తెలంగాణ బ్యూరో: టీఎస్​పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో బోర్డు సభ్యులందర్నీ సస్పెండ్​చేసి విచారణకు ఆదేశించాలని టీ పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి గవర్నర్​తమిళిసై సౌందరరాజన్​ను కోరారు. బుధవారం పార్టీ నేతలు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ గౌడ్​, షబ్బీర్​అలీ, మల్లు రవి, సంపత్​కుమార్, మల్​రెడ్డి రాంరెడ్డి, మహేశ్​కుమార్​గౌడ్, వేం నరేందర్​రెడ్డి, అనీల్​కుమార్ తో కలిసి రేవంత్​గవర్నర్ ను కలిశారు. ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్ కు విశేష అధికారాలున్నాయని, వాటి ప్రకారం ప్రస్తుతం బోర్డులో ఉన్న అందర్నీ సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీ అవతవకలపై ఫిర్యాదు చేశారు. టీఎస్​పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి, మినిస్టర్​కేటీఆర్ ను విచారణ కోసం ఆదేశించాలని  వినతి పత్రంసమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఐటీ మంత్రి కేటీఆర్ శాఖకు సంబంధించిన ఉద్యోగులే పేపర్ లీక్ లో కీలకంగా వ్యవహరించారని, అందువల్ల కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ ను దొంగిలించి రూ.కోట్లకు అమ్ముకుని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. 

సిట్​పై నమ్మకం లేదు..
పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని, పారదర్శక విచారణ చేసేందుకే గవర్నర్ ను అనుమతి కోరామని రేవంత్​స్పష్టం చేశారు. ‘ఇది లక్షల మంది విద్యార్థులు కాదు.. లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య’ అని అన్నారు. టీఎస్​పీఎస్సీ బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేసి పారదర్శకంగా విచారణ చేస్తారని భావించామని, కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్ పీఏపైనా ఆరోపణలు వస్తున్నట్టు రేవంత్​తెలిపారు.

లీకేజీలో పెద్దల పాత్ర..
పేపర్ లీకేజీ లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. గతంలో వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ తో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. టీస్​పీఎస్సీ బోర్డు సభ్యులు కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున విచారణ పూర్తయ్యే వరకు గవర్నర్ తనకున్న విశేష అధికారాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలని కోరగా గవర్నర్ సానుకూలంగా స్పందించారని, లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తెలిపినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.