జైలుకు బాబు!

జైలుకు బాబు!
  • స్కిల్ స్కాంలో ఇరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
  • ఆర్థిక నేరారోపణపై 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ కోర్టు
  • రాజమండ్రి సెంట్రల్​జైలుకు తరలింపు
  • రూ.271 కోట్లు దారి మళ్లాయన్న సీఐడీ వాదనలను ఏకీభవించిన ధర్మాసనం
  • వాడివేడిగా సాగిన ఇరుపక్షాల వాదనలు
  • ఆంధ్రప్రదేశ్​వ్యాప్తంగా 144 సెక్షన్​ అమలు
  • 36 గంటల తర్వాత వీడిన ఉత్కంఠ
  • బాబు రిమాండ్​ను హౌస్ అరెస్టుగా మార్చాలన్న అభ్యర్థన తిరస్కరణ
  • కస్టడీ కోరుతూ నేడు సీఐడీ పిటిషన్

ముద్ర,తెలంగాణ బ్యూరో : స్కిల్ డెవలప్​మెంట్ స్కాం కేసులో ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదివారం రాత్రి సంచలన తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్​22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెంకటసత్య హిమబిందు తీర్పు చెప్పారు. న్యాయమూర్తి అనుమతితో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రోడ్డు మార్గాన వెళితే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో చంద్రబాబును గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో రాజమండ్రికి తరలించారు. 

ఏం జరిగిందంటే..!

2015లో ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3,350 కోట్ల ప్రాజెక్టుకు డీల్ కుదుర్చుకుంది. జర్మనీ దేశానికి చెందిన ‘సీమెన్’ అనే సంస్థ ద్వారా యువకులకు పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం పది శాతం షేర్ ను చెల్లించాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం షేర్ చెల్లింపుల్లో రూ.271కోట్లు దారి మళ్లించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే నకిలీ బిల్లులు తయారు చేసి, ఇన్‌వాయిస్‌లు సృష్టించి జీఎస్టీని ఎగవేశారని అభియోగాలు కూడా ఉన్నాయి. తాజాగా ఏపీ స్కిల్ కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సీఐడీకీ ఫిర్యాదు అందించారు. 2021జూలై లో ఈ ఆరోపణలపై విచారణ జరపాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా సీఐడీ రిపోర్టును బేస్ చేసుకొని ఆర్థిక లావాదేవీలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఫొకస్ పెట్టింది. గతంలోనే ఆ సంస్థ చైర్మన్, డైరెక్టర్ తోపాటు 9 మందిపై కేసులు నమోదు చేయగా 8 మందికి బెయిల్ మంజూరైంది. కాగా ఏ 37 నిండితుడిగా ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కాగా సీఐడీ అధికారులు ఆదివారం ఉదయమే చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైందని బాబును విచారణ చేసేందుకు 15 రోజుల కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరారు. 

సీఐడీ వాదనాలతో ఏకీభవించిన కోర్టు..

ఎలాంటి ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండానే సీమెన్స్ ఇచ్చిన డీపీఆర్ ఆధారంగా రూ.3,281 కోట్ల బడ్జెట్ ను కేబినెట్ ముందు ఉంచిన చంద్రబాబు 90శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని కేబినెట్ కు అబద్ధాలు చెప్పారన్న సీఐడీ వాదనాలతో సీబీఐ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఏకీభవించారు. ఎలాంటి పెర్ఫామెన్స్​గ్యారెంటీ, బ్యాంకు గ్యారంటీ లేకుండానే ప్రభుత్వం రూ.371 కోట్లను డిజైన్ టెక్​కు ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. నిధులు విడుదల చేసే సమయంలోనూ డిజైన్ టెక్ సరఫరా చేసే మిషన్ల నాణ్యతను పరీక్షించాలని ఆర్థికశాఖ కార్యదర్శి సునీత నోట్​ఫైల్ లో రాశారనీ.. అయినా చంద్రబాబు ఆదేశాలతో పలు షెల్​ కంపెనీల ద్వారా డిజైన్​ టెక్​ కంపెనీ రూ.271 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని కోర్టు గుర్తించింది. కాగా ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2.23 గంటల వరకు సుమారు ఎనిమిది గంటల పాటు ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా సాగాయి. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇందులో చంద్రబాబును జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరగా.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది లూద్రా వాదించారు. సుమారు ఐదు గంటల సుదీర్ఘ విరామం తర్వాత న్యాయమూర్తి  రాత్రి 7గంటల సమయంలో తీర్పు చెప్పారు. కాగా చంద్రబాబు నేడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం తీర్పు తర్వాత.. జ్యూడిషియల్ రిమాండ్ ను హౌస్ అరెస్టుగా మార్చాలంటూ చంద్రబాబు న్యాయవాదులు చేసిన వినతిని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. 
 

వాదనలు సాగాయిలా..!

సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా,పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వాడివేడిగా సాగాయి. చంద్రబాబుపై 12‌‌0బీ (నేరపూరిత కుట్ర), 166,167 (ప్రజాసేవకుడిగా చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడడం), 418 (అధికార దుర్వినియోగం, 420 (మోసం, నమ్మక ద్రోహం), 465,468 (ఉద్దేశపూర్వకంగా వనరుల్ని వాడుకోవడం), 409 (ప్రజాసేవలో కొనసాగుతూ అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, నేరపూరిత విశ్వసన ఉల్లంఘన), 17ఏ సెక్షన్ల కింద మొత్తం 34 ఆరోపణలతో కేసులు నమోదు చేస్తూ ఆయన్ను 37ఏ నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2.23 గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదుపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన తరఫున న్యాయవాది ప్రశ్నించారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని వాదించారు. ఈ సమయంలో ఏఏజీ సుధాకర్ రెడ్డి.. ఈ కేసులో ఏ 35 ఘంటి వెంకట సత్య భాస్కర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇప్పుడు చంద్రబాబుకు సైతం 409 వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇదే క్రమంలో రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు ప్రస్తావించామని కోర్టుకు సీఐడీ సిట్ తరఫు న్యాయవాదులు తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ లోని పేజ్ 19 పెరా 8లో అన్ని అంశాలు పూర్తిగా పొందుపర్చామన్నారు. ఈ కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న కిలారు రాజేశ్ ద్వారానే ఇదంతా జరిగిందని ఏసీపీ కోర్టుకు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబును ప్రభుత్వం టార్గెట్ చేసిందని లాయర్ లూథ్రా పేర్కొన్నారు. చంద్రబాబును కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తీర్పు నేపథ్యంలో కోర్టు ప్రాంగణంతో పాటు విజయవాడలో పోలీసు బలగాలు భారీగా మొహరించారు. మరోవైపు బాబు అరెస్టులో ఆందోళనలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్​ విధించింది. సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా చూడాలని ఏపీ డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు.

సీఐడీ రిమాండ్​రిపోర్టులో అంశాలు..

స్కిల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు రిమాండ్ కోరుతూ సీబీఐ 28 పేజీలతో కూడిన రిపోర్టను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఇందులో కీలక​ అంశాలు ఇలా ఉన్నాయి. 
1. స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని నిందితులతో కలిసి నిధులు మళ్లించారని పేర్కొంది. 
2. టీడీపీ నేత ఇల్లందుల రమేశ్ ద్వారా డిజైన్​టెక్​, సీమెన్స్​ప్రతినిధులు చంద్రబాబును కలిశారు.
3. కేబినెట్ తీర్మాణాన్ని పక్కనబెట్టి గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ద్వారా బాబు కుట్రకు పాల్పడ్డారు
4. అచ్చెన్నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్​మెంట్, ఎంట్రర్ ప్రిన్యూర్​షిప్ అండ్​ఇన్నోవేషన్ పేరుతో కొత్తశాఖ ఏర్పాటు చేశారు.
5. కేవలం కంపెనీల ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్​ప్రజంటేషన్ల ఆధారంగానే ప్రాజెక్టకు ఆమోదం చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి మార్కెట్​ సర్వే జరగలేదు.
6. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సునిత వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదు.
7. ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే ముందు పైలెట్​ ప్రాజెక్టు కోరాలన్న ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత సీఎంతో చర్చించిన తర్వాతే నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎస్ కూడా నోట్​ఫైల్​లో రాశారు.
8. బాబు నిర్ణయం మేరకు నిధులు విడుదల చేయాల్సిందిగా స్కిల్ డెవలప్​మెంట్​కార్పొరేషన్​ఎండి గంటా సుబ్బారావు సీఎస్​ ను కోరారు. అప్పటి సీఎం, సీఎస్​ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయి. 
9. పలు షెల్ కంపెనీల ద్వారా డిజైన్​ టెక్​ కంపెనీ రూ. 279 కోట్లను దారి మళ్లించింది.
10.  ప్రభుత్వానికి రూ.271 కోట్ల నష్టం వచ్చినట్లు ఏపీఎస్ఎస్​డీసీ చేసిన ఫోరెన్సిక్​ఆడిట్​రిపోర్ట్​లో తేలింది.
11. జీఓ 4ను, ఆర్ధిక శాఖ అభ్యంతరాలను అతిక్రమించి బాబు ఈ కుట్రలో కీలక భాగస్వామి అయ్యారు. 
12. జీఓలో చెప్పిన్టు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడానికి కూడా బాబు, నాయుడు కుట్ర చేశారు. 
13. ఈ కుట్రపై జీఎస్టీ విచారణ మొదలుకాగానే నిందితులు ఆ నోట్​ ఫైల్స్​ ను మాయం చేశారు. 


చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా లేవనెత్తిన అంశాలు..!

1. స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం. 
2. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది. అసలు ఈ కేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు. 
2. చంద్రబాబుపై చేసినవన్నీ నిరాధారణ ఆరోపణలు మాత్రమే. 
3. రాష్ట్రానికి సీఎంగా సేవలందించిన చంద్రబాబుకు సెక్షన్- 409 వర్తించదు.
4. ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్- 409 వర్తించదు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..?
5. చంద్రబాబును నంద్యాల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం వాళ్లనుకున్న చోటే ప్రవేశపెట్టింది.
 6. బాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి తీసుకోలేదు. ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే.