జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట
  • మీడియా అకాడమీకి ఆధునిక వసతులు
  • సమాచార శాఖలో త్వరలో 361 పోస్టుల భర్తీ
  • ప్రభుత్వ స్థలాల్లో  ప్రెస్ క్లబ్ ల నిర్మాణం
  • మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వెల్లడి

ముద్ర, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు నిధులను అందించారని గుర్తుచేశారు. రూ.15 కోట్లతో నిర్మించిన మీడియా అకాడమీ భవన నిర్మాణం పూర్తయ్యిందని, దానిలో ఆధునిక సదుపాయలను కల్పించేందుకు మరిన్ని నిధులను కేటాయించి త్వరలో ప్రారంభిస్తామన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలలో ప్రెస్ క్లబ్ లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమాచార శాఖ అధికారులతో శుక్రవారం ఆయన  సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కరోనా బాధితులు, ప్రమాద బాధితులు, 479 జర్నలిస్టు కుటుంబాలకు 6 కోట్ల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. 136 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి 50 వేల చొప్పున 68 లక్షలు అందించామన్నారు. దేశంలో అత్యధికంగా 22,686 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్స్ ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. హెల్త్ కార్డుల ద్వారా జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామన్నారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ ద్వారా ఆర్థిక సహయం అందించామన్నారు. జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం నెలకు 1000 చొప్పున రూ. 74 లక్షల 37 వేలు అందించేందుకు  ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.

శిక్షణ తరగతులు

రాష్ట్రంలో 7,460 మంది జర్నలిస్టులకు ‘రెండు రోజుల శిక్షణ తరగతులను’ నిర్వహించి వారిలో వృత్తి నైపుణ్యం పెంచే యత్నం చేశామని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల 361 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. సమాచార శాఖలో పనిచేసే సిబ్బందికి కొత్త కెమెరాలు సహా సాంకేతిక పరికరాలను సమకూర్చుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లేలా సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ సమీక్షలో సమాచార శాఖ కమీషనర్ అశోక్ రెడ్డి,  డైరెక్టర్ రాజమౌళి, జిల్లాల అధికారులు పాల్గొన్నారు.