సౌత్‌ లో ఉచితాలే.. అనుచితాలా

సౌత్‌ లో ఉచితాలే.. అనుచితాలా
Freebie Politics in South India

దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నికలు గెలవాలంటే రాజకీయ పార్టీలు పూర్తిగా ఉచితాలపైనే ఆధారపడ్డాయా?  ఉచిత పందేరాలే ఎన్నికలలో ఓట్లు కురిపిస్తాయన్న నిర్ణయానికి వచ్చేశాయా? కర్నాటక విషయమే తీసుకుంటే.. పార్టీలు ఉచిత హావిూల విషయంలో పోటీ పడుతున్నాయి. ఒక విధంగా నువ్వొకటిస్తే.. నేను నాలుగు ఇస్తా అంటూ ఉచిత వాగ్దానాల విషయంలో పోటీలు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీలు అయితే తామిచ్చే ఉచితాల విషయంలో వేలం పాటలో పాట పెంచుకుంటూ పోతున్నట్లు సాగుతున్నాయి.కర్నాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ లేదా మే నెలలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  రాజకీయ పార్టీలు  హావిూలు ఇస్తున్నాయి.  హావిూల విూద హావిూలు గుప్పించేస్తున్నాయి. అయితే ఈ హావిూలలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి సంబంధించినవి ఏవిూ ఉండటం లేదు. రాజకీయ పార్టీల హావిూలన్నీ  పూర్తిగా ఉచితాలకే పరిమితమైపోయాయి. సాధ్యా సాధ్యాలతో సంబంధం లేకుండా కేవలం ఓట్ల యావతో ఆకాసానికి నిచ్చెనలు వేస్తున్నట్లు, అరచేతిలో వైకుంఠం చూపుతున్నట్లుగా వాగ్దానాలు గుప్పించేస్తున్నాయి.  మహిళలు తమ ఇంటి వ్యవహారాలను నిర్వర్తించుకోవడానికి  ప్రత్యేక అలవెన్స్‌ హావిూని కర్నాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. ఆ అలవెన్సు దాదాపు 3 వేల  మూడు వేల రూపాయలు ఉంటుందంటున్నారు. వచ్చే నెలలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ లోనే ఇందుకు కేటాయింపులు కూడా చేస్తామని చెబుతున్నారు.  అదే కోవలో కాంగ్రెస్‌ తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితం అని హావిూ గుప్పించేసింది.  కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వధ్రా తాము అధికారంలోకి వచ్చే పక్షంలో ప్రతి మహిళకూ 2,000 రూపాయల చొప్పున కుటుంబ నిర్వహణ భత్యం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేసినా, మహిళలందరికీ కుటుంబ నిర్వహణ భత్యం కింద నెలకు 2,000 రూపాయల చొప్పున చెల్లించినా రాష్ట్ర ఖజానా విూద మోయలేని భారం పడుతుందనడంలో సందేహం లేదు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని విద్యుత్‌ సరఫరా సంస్థలు ఇప్పటికే పీకల లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాయి.  
అంతే కాక, గతం లో వాగ్దానం చేసిన కొన్ని సంక్షేమ పథకాలు నిధుల కొరత కారణంగా   పట్టాలెక్కలేదు. ఇప్పుడు కొత్త  వాగ్దానాలను పార్టీలు గుప్పించేస్తున్నాయి. అంటే గతంలో ఇచ్చిన వాగ్దానాలు అటకెక్కేసినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  కర్ణాటకలో వాగ్దానాల విూద వాగ్దానాలు కురిపిస్తున్న పార్టీలు వాటి అమలు గురించి ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. ఏదో విధంగా అధికారంలోకి వచ్చేయాలన్న తపన, యావతోనే పార్టీలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.