అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ది ఎన్నికల హడావుడి

అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ది ఎన్నికల హడావుడి
  • రాష్ట్రం ఏర్పడ్డాక తూర్పు రంగారెడ్డి జిల్లాపై వివక్ష
  • మాజీ ఎమ్మెల్యే,  సమావేశం కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి

ఇబ్రహీంపట్నం, ముద్ర: అభివృద్ధి పనుల పేరుతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల హడావుడి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన టీపీసీసీ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి తో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వందల కోట్ల నిధులు అవసరమున్న నియోజకర్గంలో రూ. 64 కోట్ల మాత్రమే కేటాయించి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదం అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మరో మారు మోసం చేసేందుకు అభివృద్ధి పేరుతో రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల నుండి ఆధునీకరణకు నోచుకోని యాచారం ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు ప్రభుత్వానికి గర్తోచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నా విద్యార్థులకు రవాణా సౌకర్యం కరువయ్యిందని ఆరోపించారు.

మెట్రో రైలును ఇబ్రహీంపట్నం వరకు పొడిగించాలని అన్నారు. ఖానాపూర్ లో ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఈ ప్రాంతంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తో పట్నం పెద్ద చెరువు నింపాలని, ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకోవాలని అన్నారు. ఫార్మసీటి, బండ రావిరాల మైనింగ్ జోన్ తో ఈ ప్రాంతం పూర్తిగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటున్నదని, ఫిర్యాదులు చేసినా పట్టింపు లేదని వాపోయారు. తెలంగాణ ఏర్పాటు తరువాత తూర్పు రంగారెడ్డి జిల్లా పూర్తిగా వెనుకబడిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, ప్రజా సమస్యలు పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు దండెం రాంరెడ్డి, సీనియర్ నాయకులు పాశం లక్ష్మిపతి గౌడ్, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.