ఆగని ‘బీసీ’ లొల్లి 

ఆగని ‘బీసీ’ లొల్లి 
  • కాంగ్రెస్​లో ఆరని మంటలు 
  • వివాదాలకు దారి తీస్తున్న కమిటీలు
  • అప్పుడు టీపీసీసీ, ఇప్పుడు డీసీసీలు
  • డీసీసీ చీఫ్​ల నియామకంలో రెడ్డి పోరు
  • బీసీలను పట్టించుకోలేదని ఆరోపణలు
  • ఢిల్లీకి ఫిర్యాదులు పంపిన కీలక నేతలు
  • ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన పొన్నాల
  • రాష్ట్ర పార్టీ స్థితిగతులపై సుదీర్ఘ వివరణ
  • పొన్నం, మధుయాష్కీ, మహేశ్ గౌడ్​ మంత్రాంగం
  • టీపీసీసీ చీఫ్ రేంత్ రెడ్డి టార్గెట్ గా ఫిర్యాదులు

కాంగ్రెస్​పార్టీలో కమిటీల లొల్లి తగ్గడం లేదు. మొన్నటిదాకా బీసీలకు చాన్స్ ఇవ్వాలంటూ ఏఐసీసీకి లేఖలు రాసిన నేతలు, ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీ నినాదం ఎత్తుకున్నవారిని పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్రలు జరుగుతున్నాయంటూ ఢిల్లీకి మొర పెట్టుకుంటున్నారు. గతంలో టీపీసీసీ కమిటీలు పెద్ద రాద్ధాంతానికి దారి తీయగా, ఇప్పుడు డీసీసీ చీఫ్​ల నియామకం సైతం విభేదాలను బయటపెట్టింది. ఇదే సమయంలో బీసీ కీలక నేతలు మళ్లీ ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మరోసారి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్​లో పెరిగిన జోష్​ ప్రస్తుతం దిగిపోయింది. వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్​పార్టీ అస్త్రాలుగా తీసుకోవాలనుకుంటున్న అంశాలను సీఎం కేసీఆర్​ముందుగానే పసిగట్టి బ్రేక్​ వేస్తున్నారు. హస్తం పార్టీకి కనీస విమర్శలకు చాన్స్​ఇవ్వకుండా చేయడంలో సక్సెస్​ అవుతున్నారు.

  • డీసీసీలలో బీసీలు ఆరుగురే

కాంగ్రెస్​పార్టీని రాష్ట్రంలో 35 జిల్లా కమిటీలుగా విభజించారు. 32 జిల్లాలతో పాటుగా హైదరాబాదులో మూడు జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిలో రెడ్డి సామాజికవర్గానికి 15 జిల్లాలను అప్పగించారు. వెలమ వర్గానికి 4, వైశ్య, ఠాకూర్, కమ్మ వర్గాలకు ఒక్కొక్కటిగా ఇచ్చారు. ఓబీసీలకు కేవలం 6 మాత్రమే ఇచ్చారని, ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, మైనార్టీలకు 2 ఇచ్చారు. దీంతో బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు తగినంత ప్రాతినిధ్యం ఇవ్వ లేదంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో:టీపీసీసీ, డీసీసీ కమిటీలలో బీసీ నేతలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈ వివాదాలు పార్టీ నేతలను సందిగ్థంలో పడేస్తున్నాయి. ఇప్పటికే ఏకంగా పలువురు నేతలు కాంగ్రెస్​ను విడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా డీసీసీ ప్రెసిడెంట్ల నియామకంలోనూ చిచ్చు రాజుకుంది. ప్రధానంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సీటుకు ఎసరు పెట్టారు. జనగామ జిల్లా అధ్యక్షుడిగా పొన్నాలకు వ్యతిరేకంగా కొమ్మూరి ప్రతాప్​రెడ్డిని నియమించారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మూడు జిల్లాలకు డీసీసీ చీఫ్​లను నియమిస్తే.. రెండు చోట్ల రెడ్డి, ఒకచెట వెలమ సామాజిక వర్గానికి చోటు కల్పించారంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే, ఇటీవల కాంగ్రెస్​ జాతీయ ఎన్నికల కమిటీలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్​కు స్థానం కల్పించారు. కానీ, గతంలో పీసీసీ చీఫ్​గా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, ఆంజన్ కుమార్​యాదవ్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్​ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని బీసీ నేతలను ఉద్దేశపూర్వకంగా అణిచివేసేందుకు రేవంత్​రెడ్డి నేతృత్వంలో కుట్ర జరుగుతుందనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. 

  • ఏం చేయాలి?

నిజానికి, రాష్ట్రంలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉన్నట్టు కనిపించింది. అగ్రనేతలు కూడా రాష్ట్రానికి వరుసగా క్యూ కట్టారు. రాహుల్​, ప్రియాంక, ఖర్గేతో పాటుగా ఏఐసీసీ జనరల్​సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ వంటి నేతలంతా ఇటే వచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నాయని ఆశపడ్డారు. ముఖ్యంగా కర్ణాటకలో ఓటమి తర్వాత బీజేపీ నిరాశ, నిస్పృహలతో స్తబ్దుగా ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ చేరికలతో కళకళలాడింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం షర్మిల పార్టీని విలీనం చేస్తున్నారనే ప్రచారంతో పార్టీ నేతలు కొంత దూకుడు పెంచేందుకు ప్రణాళికలు వేశారు. ఈ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి సైలెంట్​గా ఉంటున్నారు. పాదయాత్ర చేసి అలిసిపోయిన భట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఉన్నారు. 

  • పదండి పోదాం హస్తినకు

డీసీసీ కమిటీల లొల్లి ఢిల్లీకి చేరింది. మూడు జిల్లాల డీసీసీ చీఫ్​ల ప్రకటన తర్వాత వెంటనే పొన్నాల లక్ష్మయ్య హస్తినలో వాలిపోయారు. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. ప్రధానంగా రేవంత్​ రెడ్డిపైనే ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతున్నది. మీడియాతో మాట్లాడుతూ కూడా పార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలలో గెలిచినట్టుగా బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గెలవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోవాలని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే బీసీల మద్దతు అవసరమని, ఎందుకంటే జనాభాలో మెజారిటీ ప్రజలు బీసీలే అని పొన్నాల వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప రెడ్డి నియామకంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని కలిసి సమస్యను వివరించారు. ఖర్గే పొన్నాల లక్ష్మయ్యను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా జనగామ డీసీసీ నియామకం విషయంలో తన అసంతృప్తిని ఖర్గే వద్ద వెల్లడించినట్టు తెలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పొన్నాల పార్టీ పరిస్థితులు, జనగామ డీసీసీ నియామకం గురించి మాట్లాడినట్టు చెప్పారు. పార్టీని బలోపేతం చేయాలంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించానన్నారు. ఖర్గేను కలవడం అంటే ఫిర్యాదు చేయడం కోసమే అనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఖర్గేతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తాను ఆయనతో పార్టీ అంతర్గత విషయాలు చర్చించానని చెప్పారు.