బీసీ కాంగ్రెస్!

బీసీ కాంగ్రెస్!
  • తొలి జాబితాలో లేని బీసీ నేతల పేర్లు?
  • అగ్రవర్ణాల తీరుపై లీడర్లు భగ్గు
  • రెండుగా చీలిన టీపీసీసీ
  • రేపు ఢిల్లీకి బీసీ సీనియర్లు
  • అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం?
  • అక్టోబర్​10న షాద్ నగర్​బీసీ గర్జనకు సిద్ధరామయ్య

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో 34 టిక్కెట్లు బీసీలకు కేటాయించాలనే టీ కాంగ్రెస్​నేతలు డిమాండ్ చేస్తుండటంతో టీపీసీసీ రెండుగా చీలింది. ఇప్పటికే అంతర్గతంగా రాజుకున్న బీసీ, అగ్రవర్గాల చిచ్చు ఆ పార్టీలో కొత్త సమీకరణాలకు తెరలేపినట్లయింది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్​అధికారంలోకి వస్తుందంటూ కాంగ్రెస్​ బీసీ సీనియర్​నాయకులు ఇది వరకే అధిష్ఠానానికి తెలిపారు. ఈ విషయంలో గాంధీభవన్ వేదికగా తమ డిమాండ్​ను బలంగా వినిపించిన నేతలు.. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలకూ విన్నవించారు. 

బీసీ నేతల ఆగ్రహం..

టీపీసీసీలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి.. సుమారు 60 మంది అభ్యర్థులతో తొలి జాబితా దాదాపుగా పూర్తయినా.. అందులో బీసీ నేతల పేర్లు లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన సీనియర్​ నేతలు భగ్గుమంటున్నారు. స్క్రీనింగ్​కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ వ్యవహారంపై అంతర్గతంగా మండిపడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు టిక్కెట్ల కోసం విన్నపాలతో సరిపెట్టిన బీసీ నేతలు.. తాజాగా ఏఐసీసీతో కొట్లాటకు సిద్ధమయ్యారు. బీసీలకు ఎన్ని టిక్కెట్లు ఇస్తారు..? ఏయే స్థానాలకు కేటాయిస్తారో..? అని తాడోపేడో తేల్చుకునేందుకు రేపు ఢిల్లీ బాట పట్టనున్నారు. గాంధీభవన్​ వేదికగా.. గత రెండు రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్న బీసీ నేతలు ఏఐసీసీకి అల్టిమేటం జారీ చేశారు. బీసీలకు ఆశించిన టిక్కెట్లు ఇవ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలో రావడం కష్టమని తేల్చి చెప్పేశారు. మరోవైపు సోమవారం గాంధీభవన్​ లో మాట్లాడిన మాజీ ఎంపీ వి.హనుమంతరావు.. బీసీ సబ్ ప్లాన్, కుల గణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు, రాజకీయ ప్రాధాన్యం తదితర అంశాలపై స్పందించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఏఐసీసీకి డిమాండ్​ చేశారు. బీసీ లు అండగా ఉంటేనే విజయం సాధిస్తామన్న ఆయన ఆ వర్గానికి సంఖ్యా పరంగా నిధుల కేటాయింపు జరగాలన్నారు. అక్టోబర్10న షాద్​నగర్​ లో బీసీ గర్జన నిర్వహిస్తున్నామన్న వీహెచ్.. ఆ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరవుతారని చెప్పారు. బీసీలందరూ సభకు వచ్చి సక్సెస్​చేయాలన్నారు.

బీసీ సీఎం..!

ఎన్నికలకు ముందు బీసీలకు అత్యధిక ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న ఆ వర్గ నేతలు తెలంగాణలో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక బీసీ అభ్యర్థికి సీఎంగా అవకాశం కల్పించుకునే పనిలో పడ్డారు. మాజీ పీసీసీ చీఫ్​పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్​ సీఎం రేసులో ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. గాంధీభవన్ లో మీడియా మీట్లు, క్షేత్రస్థాయి కార్యక్రమాలతో తరుచూ వార్తల్లకెక్కుతోన్న మాజీ ఎంపీ హనుమంతరావు సైతం సీఎం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ లో బలోపేతమవుతోన్న బీసీ కార్డు రాజకీయంపై అగ్రవర్గాలు నోరు మెదపడం లేదు. కానీ ఏఐసీసీ స్థాయిలో తమదైన ముద్ర వేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డితోపాటు ఎంపీలు ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్​అధికారంలోకి వస్తే తమదే కీలక పాత్ర ఉంటుందని ఇప్పటికే పలు సందర్భాల్లో పరోక్ష ప్రకటనలు చేశారు. ఇటు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ వంటి కీలక నేతలూ సీఎం కుర్చీపై కన్నేశారు. ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా.. రానున్న రోజుల్లో కాంగ్రెస్​బీసీలకు ఎన్ని టిక్కెట్లు కేటాయిస్తుంది..? సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందనే చర్చ ఆసక్తి రేపుతోంది.