ఏడాదికో ప్రత్యేకత ఆ గణేష్ మండపం సొంతం

ఏడాదికో ప్రత్యేకత ఆ గణేష్ మండపం సొంతం
  • ఐదేళ్లుగా ఐదు వింత ఆకృతులతో ఆకట్టుకుంటున్న వైనం
  • సుతారి మేస్త్రి చేతి నుంచి అద్భుత ఆవిష్కరణలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: గణేష్ నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయంటే అక్కడ జనాల్లో ఒక ఆత్రుత...ఈ ఏడాది మండపం వద్ద ఎలాంటి అలంకరణ ఉంటుందో ఏం వింతను చూపెడతారో అని ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు అక్కడి భక్తులు. ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసే వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఐదేళ్లుగా వినాయకుడిని ఏర్పాటు చేస్తున్న ఇందిరమ్మ కాలనీ1 మసీద్ ప్రాంతానికి చెందిన కడారి హరిబాబు ప్రతి సంవత్సరం మండపం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఏదో ఒకటి చూపెడుతుంటాడు. మొదటి సంవత్సరం పేపర్ వినాయకుడు, 2వ సంవత్సరం కృష్ణుడి నందనవనం, మూడవ సంవత్సరం పేపర్ గ్లాసులతో బతుకమ్మ, నాలుగవ సంవత్సరంలో శివుడి పైన గంగ దేవినీ ప్రస్తుతం ఐదవ సంవత్సరంలో వినాయకుడి మండపం ఎదుట శివునితో కూడిన మరో మండపాన్ని ఏర్పాటు చేయడం అక్కడి భక్తులను ఆకట్టుకుంటుంది. ఇది ఎక్కడో కాదు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ మొదటి విడుత కాలనీలో మసీద్ వద్ద సుతరిమేస్త్రి కడారి హరిబాబు చేతుల మీదుగా ఆవిష్కృతమైన అద్భుతాలు.

ఈ ఏడాది వినాయకుడి వద్ద ధర్మకోల్ షీట్స్ తో సహాయకుడు రింగు హర్షవర్ధన్ సహకారంతో సుతారి మేస్త్రి హరిబాబు ఏర్పాటుచేసిన శివలింగం కళ్యాణ మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. లక్షలు వెచ్చించి అద్భుతమైన సినిమా సెట్టింగ్స్ తో మండపాలు ఏర్పాటు చేస్తున్న ఈ రోజుల్లో తనకు తెలిసిన విజ్ఞానంతో తక్కువ వ్యయంతో గణేష్ మండపం వద్ద చూడముచ్చటగా అందరిని ఆకర్షించేలా అద్భుతాలు ఆవిష్కరిస్తున్న హరిబాబును భక్తులు అభినందిస్తున్నారు. అంతేకాకుండా విషయం తెలుసుకున్న పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు శివలింగంతో కూడిన కళ్యాణ మండపాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఏది ఏమైనా ఒక సుతారి మేస్త్రి ఇలాంటి అద్భుతాలు సృష్టించడం  అభినందనీయమని భక్తులు పేర్కొంటున్నారు. హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయకుడి తరహాలో మా కాలనీలో మేము ఏర్పాటు చేసే విగ్రహానికి ప్రతి ఏడాది ఒక ప్రత్యేకతను తీసుకురావాలన్నదే నా లక్ష్యమని కడారి హరిబాబు తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న కాలనీవాసులకు భక్తులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.