కొండగట్టు మీద కన్ను 

కొండగట్టు మీద కన్ను 
  • త్వరలో టెంపుల్​ డెవలప్​మెంట్ అథారిటీ?
  • లేదా ప్రత్యేక కమిటీ నియామకం
  • చైర్మన్ గా దీవకొండ దామోదర్ రావు!
  • ప్రగతిభవన్​ మీటింగ్ లోనూ చర్చ
  • యాదాద్రి తరహాలో భూమి ధరలకు రెక్కలు?
  • ఇప్పటికే సన్నిహితుల రంగప్రవేశం
  • బలపడుతున్న అనుమానాలు
  • వేములవాడ, ధర్మపురి మీద మౌనం

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు మీద సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.​అభివృద్ధి కోసం వందల కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇటీవల అక్కడకు వెళ్లి పూజలు చేసి, సమీక్ష నిర్వహించిన సీఎం వెయ్యి కోట్లైనా సరే అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించారు. ఈ సంగతి ఎలా ఉన్నా దీనికోసం కోఠరీ రూపొందుతున్నది. ఇప్పటికే 100 కోట్లు విడుదల చేయడం, ఇంకో రూ. 500 కోట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కొండగట్టు టెంపుల్ డెవలప్​మెంట్​ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యతలను కేసీఆర్ కుటుంబ అనుచరుడు, రాజ్యసభ ఎంపీ, అధికార పార్టీ పత్రిక ఎండీ దీకొండ దామోదర్​ రావుకు అప్పగించనున్నారని సమాచారం. 


ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇప్పటికే యాదాద్రి టెంపుల్​ను వేల కోట్లు పెట్టి, సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం, అక్కడ చుట్టూరా 50 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలను వంద రేట్లు పెరిగేలా చేసింది. అక్కడ అధికార పార్టీకి చెందిన ప్రముఖులకు వందల ఎకరాలు ఉన్నట్లు కూడా ఆరోపణలున్నాయి. తాజాగా ఇదే వ్యూహాన్ని కొండగట్టులోనూ అమలు చేస్తున్నారని అంటున్నారు. దీవకొండ దామోదర్​ రావుకు ఈ బాధ్యతలను అప్పగించేందుకు ప్రగతిభవన్​లో బుధవారం జరిగిన అంతర్గత భేటీలోనూ చర్చించినట్లు తెలిసింది. 

ఒక్కొక్కరుగా కొండగట్టు బాట
రాష్ట్ర ప్రభుత్వం కొండగట్టు దారి పట్టింది. దాదాపు యేడాదిన్నర నుంచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివిధ కార్యక్రమాలతో ఈ పుణ్యక్షేత్రానికి పర్యటనలు పెంచారు. 2021లో రామకోటి స్థూపానికి శంకుస్థాపన చేశారు. అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంలో  సీఎం కేసీఆర్‌ ఆలయ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించడం, ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీని పక్కన పెట్టి  చుట్టూరా గుంట భూమి లేని వేములవాడకు రూపాయి ఇవ్వకుండా వదిలేయడంతో  కొత్త అనుమానాలు మొదలయ్యాయి. విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా కేసీఆర్​ టూర్, ఆ వెంటనే ఎంపీ సంతోష్​ అవెన్యూ ప్లాంటేషన్​ పేరిట రెండు వేల ఎకరాలను దత్తత తీసుకోవడంతో  అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. 

యాదాద్రిలోనూ ఇంతే
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రస్తుతం రూపు మారిపోయింది. ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేశారు. అప్పుడు చిన్నజీయర్‌ స్వామితో సన్నిహితంగా ఉన్న కేసీఆర్‌ ఆయన సూచన మేరకు తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు  పునర్నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కానీ, యాదాద్రిలో కేసీఆర్​ కుటుంబంతో పాటుగా బడా నేతలు, కేసీఆర్​ సన్నిహితులకు కలిసి వచ్చిందని, రియల్‌ దందా చేశారనే విమర్శలు వచ్చాయి. బినామీ పేర్లతో యాదగిరి సమీపంలోని వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినతర్వాతే యాదాద్రి పుననిర్మాణానికి శ్రీకారం చుట్టారని, మొదట్లో తక్కువ ధరలకు కొన్న భూములను అధిక ధరలకు విక్రయించారనే విమర్శలను మూటగట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అక్కడి భూముల రేట్లు వందకు వంద శాతం పెరిగాయి. 

దామోదర్ రావుకు బాధ్యతలు
సీఎం కేసీఆర్‌ కొండగట్టు అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. వరుస పర్యటనలు, నిధుల కేటాయింపు వెనుక పెద్ద స్కెచ్‌ ఉండి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం విస్తారమైన అటవీ ప్రాంతం, భూములు ఉన్న ప్రాంతం కొండగట్టు మాత్రమే. ఖనిజ సంపద కూడా ఉంది. ఇప్పటికే ఆలయం చుట్టూ ఉన్న భూములను బినామీలతో కొనుగోలు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే కొండగట్టుకు వెళ్లి భూములు కొన్నారని విమర్శించారు. ఒకవేళ అథారిటీ ఏర్పాటు ఆలస్యమైతే, టెంపుల్​కు ప్రత్యేక కమిటీని వేయాలని సీఎం భావిస్తున్నారు. ఈ కమిటీ బాధ్యతలను ఎంపీ దీకొండ దామోదర్​ రావుకు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. సీఎం టూర్​నేపథ్యంలో దామోదర్​రావు అన్నీ తానై వ్యవహరించారు. సమీక్షలోనూ ఆయనే వెన్నంటి ఉన్నారు. పలు సూచనలు సైతం చేశారు. ఇప్పటికే అధికారులతో ఆయన సంప్రదింపులు చేస్తున్నారు. గతంలో కూడా భూ వివాదాల వ్యవహారంలో కేసీఆర్​కు, ప్రగతిభవన్ కు దూరమైన ఆయన, ఆ తర్వాత కాలంలో మళ్లీ దగ్గరయ్యారు. ఇటీవల రాజ్యసభ ఎంపీగా నియమితులయ్యారు. అయితే, కొండగట్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇక్కడి వ్యవహారాలు, కీలక అంశాలన్నీ తమ అనుకూలమైన దోస్త్​ దగ్గరే ఉండాలని భావిస్తున్నారు. అందుకే దామోదర్​రావుకు త్వరలోనే కొండగట్టు బాధ్యతలను అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

ఈ ఆలయాలపై చిన్నచూపు ఎందుకు
దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల క్రితం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు యేడాదికి రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి భూమి కావాలని ఆలయాన్ని ఆనుకుని ఉన్న చెరువును పూడ్చివేయించారు. ఆలయం చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలు కూల్చాలని ఆదేశించారు. మాస్టర్‌ ప్లాన్‌ను కూడా రిలీజ్‌ చేసి శివభక్తులలో ఆశలు రేకెత్తించారు. తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ఐదేండ్లలో  రూ.50 కోట్ల పనులు మాత్రమే ఇచ్చారు. ఇక, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని కూడా యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఈ మేరకు మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తరలించాలని ఆదేశించారు. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారు. వేములవాడ, ధర్మపురి ఆలయాల అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోవడానికి విపక్షాల నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు అనేక కారణాలు చెబుతున్నారు. వేములవాడ, ధర్మపురిలో బినామీల పేర్లతో కొనుగోలు చేయడానికి, రియల్‌ దందా చేయడానికి భూముల లేవని, అందుకే ఆలయాల అభివృద్ధిని పక్కన పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.