అప్రూవర్​గా ఎంపీ మాగుంట

అప్రూవర్​గా ఎంపీ మాగుంట
  • ఈడీకి కీలక సమాచారం అందజేత?
  • ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో పరిణామం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ కేసుకు సంబంధించి ఎంపీ మాగుంట ఈడీకి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎంపీ మాగుంట అప్రూవర్‌గా మారడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. రాఘవ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. 

సౌత్ గ్రూప్​లో కీలకం..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూపు పాత్ర కీలకంగా ఉన్నట్లు ఇప్పటికే ఈడీ వెల్లడించింది. ఈ సౌత్ గ్రూప్​నకు ఎమ్మెల్సీ కవిత నాయకత్వం వహించినట్లుకూడా ఆరోపణలున్నాయి. ఇలాంటి సౌత్ గ్రూపులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీ మాగుంట, ఆయన కుమారుడు రాఘవ అప్రూవర్‌గా మారారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు తరలింపుపై దృష్టి సారించింది. తాజాగా వీరిద్దరు అప్రూవర్​గా మారడంతో ఇప్పటికే పలువురిని విచారణ చేసిన ఈడీ.. మరికొందరు కీలక వ్యక్తులను త్వరలో విచారణ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.