సమైక్యత దినోత్సవాన్ని  గ్రాండ్​గా నిర్వహిస్తాం

సమైక్యత దినోత్సవాన్ని  గ్రాండ్​గా నిర్వహిస్తాం
  • 17న హైదరాబాద్ వేడుకల్లో పాల్గొననున్న కేసీఆర్
  • జిల్లాల్లో జాతీయ జెండాలను ఎగరేయనున్న మంత్రులు
  • తెలంగాణ చరిత్రను పార్టీలు వక్రీకరిస్తున్నాయి
  • ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, జిల్లాల్లో జరిగే సంబరాల్లో మంత్రులు పాల్గొని జాతీయ జెండా ఎగరేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ భారత్ సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారని అన్నారు. ఈసారి కూడా ఎక్కడిక్కడ సంబరాలను నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. అయితే తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవంపై కొన్ని రాజకీయ పార్టీలు మతం అంశాన్ని జోడించి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారత దేశంలో అంతర్భాగంగా మారిందని కేటీఆర్​గుర్తు చేశారు. ఆరోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య పరివర్తన చెందిన రోజని కొనియాడారు. ఆనాటి చరిత్రతో సంబంధం లేని అవకాశవాదులు తెలంగాణ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇండ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు..

హైదరాబాద్ నగరంలోని జేఎన్‌ఎన్‌ యూఆర్‌ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హెచ్‌ఎండీఏ నుంచి కేటాయించిన ఈ నిధులతో మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు పలువురు ఆయా కాలనీల్లోని ప్రజలు మరమ్మతుల కోసం నిధులు వెచ్చించుకోలేరని, ప్రభుత్వమే వారికి అవసరమైన విధులను అందిస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో పేదల లబ్ధి చేకూరుతుందంటే నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడబోదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జంగంమెట్‌, బండ్లగూడతోపాటు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే కాలనీల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది పూర్తి చేస్తారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.9,100 కోట్లు నిధులను ఖర్చు చేసిందన్నారు. ఆ ఇండ్లను పేదలకు ఉచితంగానే అందజేస్తున్నామని అన్నారు.