చెప్పింది చేసిన వారికే గుర్తింపు

చెప్పింది చేసిన వారికే గుర్తింపు

తిరుపతి లో 'మూడు దారులు' పుస్తక పరిచయ కార్యక్రమంలో వక్తలు

 తిరుపతి: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన "మూడు దారులు" పుస్తక పరిచయ కార్యక్రమంలో వక్తలు ఈ పుస్తకం భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓకే సారి రాజకీయాలలోనూ, శాసనసభ లోనూ అడుగు పెట్టిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంచుకున్న భిన్న మార్గాలను దేవులపల్లి అమర్ రాసిన పుస్తకం అద్దం పడుతుందని వక్తలు ప్రశంసించారు. ప్రతిష్టాత్మక రూప పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్, న్యూ ఢిల్లీ ఈ పుస్తక ప్రచురణ కర్త. ప్రముఖ వైద్య నిపుణులు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో సన్నిహితంగా వ్యవహరించిన డాక్టర్ ఎస్.బలరామ రాజు వైఎస్సార్ తో తన అనుబంధాన్ని వివరించారు.

సభకు అధ్యక్షత వహించిన సీనియర్ జర్నలిస్టు, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ పి.రామచంద్రా రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు - విద్యా, పారిశ్రామిక రంగాల ప్రగతి అన్న అంశంపై ప్రసంగిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయనీ, ఈ కారణంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడవసారి నెంబర్ వన్ స్థానం లో నిలిచిందని గుర్తు చేశారు. 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలు రానున్నానీ, భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీ రంగానిదే అని వివరించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దువ్వూరి జమున మూడు దారులు పుస్తకం లో అంశాలను సవివరంగా విశ్లేషించారు. ఎప్పుడూ నేను, నాది  (ఐ, మి) అనుకునే వారిని మానసిక శాస్త్రంలో మానసిక జబ్బుగా పరిగణిస్తామనీ, వ్యక్తిగతంగా తన గురించి మాత్రమే చెప్పుకోవడం ఓ మేనియా అనీ చెప్పుకొచ్చారు. అలాగే మేము, మనము (వియ్, అవర్స్) అనుకునే నేతలు 'ప్రజల మనుషులు'  అవుతారనీ, ఈ గుణం స్వయం సిద్ధంగా వచ్చే స్వభావం అని విశ్లేషించారు. రాజశేఖర రెడ్డి, జగన్ స్వభావాలు ఒకటే అని ప్రొఫెసర్ జమున గుర్తు చేస్తూ వ్యక్తి గత అజెండా, వ్యక్తి గత ఇమేజ్ పక్కన పెట్టి ప్రజాసేవనే పరమావధిగా వ్యవహరించే ప్రజా నాయకులు అయ్యారని పేర్కొన్నారు.


జగన్ మోహన్ రెడ్డికి అనుభవం లేదని చేసే విమర్శలకు ప్రొఫెసర్ జమున ధీటైన జవాబు ఇచ్చారు. ఏ పూర్వ పాలనానుభవం లేని అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన దేశాన్ని ఎంత చక్కగా పాలించి పేరు తెచ్చుకున్నారో గుర్తు చేసుకోవాలన్నారు.  చెప్పింది చేసే నేతకు అనుభవం ప్రామాణికం కాదనీ ఆ కోవలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనీ తన విజనరీ దృష్టి తో 'ట్రెండ్ సెట్టర్' గా రుజువు చేసుకున్నారని వివరించారు. డాక్టర్ వైఎస్ఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న డాక్టర్ బలరామ రాజు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనం అని ఎన్నో దృష్టాంతాలు చెప్పారు. ఒక రూపాయి డాక్టర్ గా వైఎస్ పేదలకు అందించిన సేవలు అమూల్య మని పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్టు పి.వి.రవికుమార్ మూడు దారులు పుస్తక పరిచయం చేస్తూ.. సమకాలీన రాజకీయ చరిత్రను అమర్ కళ్లకు కట్టినట్లు వివరించారని చెప్పారు. వైస్ ఎపిసోడ్ లో చంద్రబాబు బృందం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న వైనం రచయిత అత్యంత ఆసక్తి కరంగా వివరించారని పేర్కొన్నారు. రచయిత అమర్ స్పందిస్తూ.. తాను తెలుగులో మూడు దారులు పుస్తకం, ఇంగ్లీషు లో 'ది డెక్కన్ పవర్ ప్లే' పుస్తకంలో వాస్తవాలను మాత్రమే రాశాననీ, ఎంతో పరిశోధన చేసి, వృత్తి పరంగా తన అనుభవాలను క్రోడీకరించి సమకాలీన రాజకీయ చరిత్రను పాఠకులకు అందించానని వివరించారు.