రోడ్డెక్కిన ‘రెడ్లు’

రోడ్డెక్కిన ‘రెడ్లు’
  • మంత్రుల​క్వార్టర్స్​ను ముట్టడించిన జేఏసీ నేతలు
  • ఒక్కొక్కరుగా ఇళ్లలోకి వెళ్లిన లీడర్లు!
  • ఇంటి ముందు బైఠాయించి ఆందోళన
  • రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్​ 
  • పోలీసులకు, జేఏసీ నాయకుల మధ్య వాగ్వాదం
  • బంజారాహిల్స్​పోలీస్​స్టేషన్​కు తరలింపు
  • రెడ్డి మంత్రులపై సీఎం కేసీఆర్​సీరియస్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో రెడ్డి సామాజిక వర్గం రోడ్డెక్కింది. సోమవారం రెడ్డి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు మంత్రులు నివాస సముదాయాన్ని ముట్టడించారు. ఏదో పని ఉందని చెబుతూ.. ఒక్కొక్కరుగా మంత్రుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వారు ఇండ్లలోకి వెళుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో గుంపుగా ఏర్పడి.. మంత్రుల నివాసం వద్ద ఆందోళనకు దిగారు. 

  • వీవాంట్​జస్టిస్​అంటూ బైఠాయింపు..

తమ సమస్యలను పరిష్కారించాలంటూ హంగామా చేశారు. ‘వీ వాంట్​జస్టిస్’ అని నినాదాలు చూస్తూ మంత్రుల ఇళ్ల ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని లేపేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి నాయకులు డిమాండ్​చేశారు. తాము ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నా.. ఏ ఒక్క మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఆందోళనతో బంజారాహిల్స్​లోని మంత్రుల క్వార్టర్స్​వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులు రెండు గంటల పాటు బయటకు రాలేకపోయారు. అనంతరం పోలీసులు మంత్రుల ఇళ్ల ప్రధాన ద్వారాలకు తాళం వేశారు. లోపలికి వెళ్లుతున్న వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆందోళన చేస్తున్న వారిని బంజారాహిల్స్​పోలీస్​స్టేషన్​కు తరలించారు. 

  • సీఎం ఆగ్రహం..

రెడ్డి నాయకుల ఆందోళనతో సీఎం కేసీఆర్​ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంటలిజెన్స్​అధికారులు ఏంపని చేస్తున్నారని ఆరా తీశారు. మంత్రుల నివాసాలను ముట్టడించేందుకు రెడ్డి జేఏసీ చేసిన పని ఇంటలిజెన్స్​కు తెలియకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసులు, ఇంటలిజెన్స్ ఆఫీసర్లకు నోటీసులను జారీచేసింది. 

  • జేఏసీల్లోనే రెండు సంఘాలు..

రెడ్డి జేఏసీల్లోనే రెండు సంఘాలు ఉన్నాయి. వీటిలో ఓ వర్గం కేసీఆర్​తో బాగానే ఉంది. ఇటీవల కాలంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని రెడ్డిలు విమర్శించినప్పుడు ఓ వర్గం సపోర్టు చేసింది. అయితే ఈసారి రెండు సంఘాలు ఏకమై మంత్రుల నివాసంపై దాడికి యత్నించింది. ఈ ఘటనలో రెండు సంఘాల నాయకులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. అయితే దీనివల్ల సీఎం కేసీఆర్​కు రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా దూరమైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్​రెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, వేముల ప్రశాంత్​రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ఉన్నారు. కానీ వీరందరూ కూడా రెండు సంఘాల నేతలతో టచ్​లో లేనట్లు తెలిసింది. అయితే ఈ రెండు సంఘాలు ఎందుకు ప్రభుత్వానికి దూరమైనాయో అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే రెడ్డి మంత్రులపై సీఎం సీరియస్​అయ్యారని తెలిసింది. కాగా కాంగ్రెస్​పార్టీలో రేవంత్​రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ సామాజిక వర్గానికి బాగా లబ్ధి చేకూరుతున్నట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై రెడ్డి జేఏసీ దాడి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.