బీసీ స్టూడెంట్లకు  వందశాతం ఫీజు వాపస్

బీసీ స్టూడెంట్లకు  వందశాతం ఫీజు వాపస్
  • దేశ, విదేశీ యూనివర్సిటీ విద్యార్థులకు పూర్తి రీయింబర్స్ మెంట్​
  • ప్రకటించిన బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్​గంగుల
  • ఏటా 10 వేల మంది స్టూడెంట్లకు లబ్ధి
  • సీఎంకు కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి

ముద్ర, తెలంగాణ బ్యూరో : సమాజంలోని వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో డెవలప్​అవ్వాలనే సంకల్పంతో బీఆర్ఎస్​ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలుసహా 200కు పైగా ఇన్​స్టిట్యూట్​లలో ప్రవేశం పొందిన వారికి మొత్తం ఫీజులను(ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల ఆదేశించారు. గతంలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని, ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు కూడా అందజేయాలని సీఎం ఆదేశించారని, ఈమేరకు అమలు చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు అబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకోసం అదనంగా ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు వెచ్చిస్తుందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్ షిప్​తోపాటు రాష్ట్రంలోనూ ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లిస్తున్నట్లు మినిస్టర్​గంగుల పేర్కొన్నారు. 

  • దేశంలో తెలంగాణ ఒక్కటే..

ఇకనుంచి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లోని బీసీ బిడ్డలకు సైతం పూర్తి ఫీజు అందించడంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే అని మంత్రి గంగుల కమలాకర్​అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ఆసరా ఫించన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్​తదితర పథకాల్లో మెజార్టీ వాటాతోపాటు ప్రత్యేకంగా వేలకోట్లతో ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు లక్ష రూపాయల సహాయం, లక్షలాది బీసీ బిడ్డలకు నాణ్యమైన ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాలు తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీ బిడ్డలకు ఎస్సీ, ఎస్టీల మాదిరి ఫీజు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేశారు.