పొత్తు కుదిరేనా?

పొత్తు కుదిరేనా?
  • కామ్రేడ్లకు కాంగ్రెస్ గాలం
  • వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీకి నిర్ణయం
  • సీపీఐ నేతలతో మానిక్ రావ్ ఠాక్రే​భేటీ
  • నాలుగు స్థానాలకుగాను రెండు ఇచ్చేందుకు అంగీకారం? 
  • సీపీఎం పోలిటీ బ్యూరో సమావేశంలో పొత్తుపై చర్చ
  • భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ స్థానాల డిమాండ్​
  • తెలంగాణలో మారనున్న సమీకరణాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ తో కమ్యూనిస్టులతో పొత్తు కుదురుతుందా..? వచ్చే ఎన్నికల్లో సీపీఎం ఎన్ని స్థానాల నుంచి బరిలోకి దిగుతుంది..? సీపీఐ ఎన్ని స్థానాలు డిమాండ్ చేస్తుంది..? కామ్రేడ్లు డిమాండ్ చేస్తున్న స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్​సమాలోచనలు చేస్తుందా..? ఇప్పుడీ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కామ్రేడ్లు.. 2009లో టీడీపీ, టీఆర్ఎస్ తో, 2‌014 లో కాంగ్రెస్, వైఎసీతో, 2018 ఎన్నికల్లో టీజేఎస్, టీపీడీ, కాంగ్రెస్​(మహాకూటమి), 2018 మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తో జత కలిశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​తో పొత్తు వ్యూహం బెడిసికొట్టడంతో సీఎం కేసీఆర్ వైఖరిపై మండిపడుతోన్న కమ్యూనిస్టులు.. కాంగ్రెస్​తో కలిసి పోరాడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అధికారమే లక్ష్యంగా హస్తం పావులు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కామ్రేడ్లను వాడుకున్న బీఆర్ఎస్​వచ్చే ఎన్నికల్లో వారిని దూరం పెట్టిన అంశాన్ని ‘హస్తం’ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కామ్రేడ్లతో కలిసి బీఆర్ఎస్​ను దెబ్బకొట్టేలా వ్యూహాలకు పదునుపెడుతోంది. 

కమ్యూనిస్టులకు ఊహించని షాక్​

గతేడాది నవంబర్​లో మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఆ సెగ్మెంట్ లో తొలిసారిగా గులాబీ జెండా ఎగురవేసిన బీఆర్ఎస్​వచ్చే ఎన్నికల్లోనూ తమతో పొత్తు పెట్టుకుంటుందని కామ్రేడ్లు భావించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు అధినేతతో కలిసి పొత్తులపై చర్చించిన కమ్యూనిస్టులు తమ గెలుపునకు అనుకూలంగా ఉండే స్థానాలు డిమాండ్​ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసే పోటీ చేయడం ఖాయమనే సంకేతాలూ బయటపడ్డాయి. కానీ ఇటీవల 115 స్థానాలకు బీఆర్ఎస్​అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్​ కమ్యూనిస్టులకు ఊహించని షాక్​ ఇచ్చారు. దీంతో కేసీఆర్​పై తీవ్ర అసంతృప్తితో ఉన్న కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఓడించే పార్టీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి.

ఠాక్రేతో భేటీ..

ఈనెల 26న.. చేవెళ్ల లో కాంగ్రెస్​ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావ్​ ఠాక్రే కమ్యూనిస్టులతో సంప్రదింపుల పర్వానికి తెరలేపారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో భేటీ అయిన ఠాక్రే పొత్తుపై చర్చించారు. ఇందులో కూనంనేని.. తన నియోజకవర్గం కొత్తగూడెంతోపాటు బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు స్థానాలకు టిక్కెట్ల ప్రస్తావన తెచ్చారు. ఇందులో సీపీఐకు హుస్నాబాద్, మునుగోడు అసెంబ్లీ టిక్కెట్ల తోపాటు అధికారంలోకి వస్తే ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సముఖత చూపినట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన రెండు స్థానాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. 

సీట్ల కేటాయింపుపై చర్చ..

మరోవైపు.. ఠాక్రేతో భేటీ అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన కూనంనేని బీఆర్ఎస్​పై కాంగ్రెస్ తో కలిసి పనిచేసే విషయంపై చర్చించారు. పొత్తు ఆలోచన ఉంటే కాంగ్రెస్ అధిష్టానంతో సీట్ల కేటాయింపు అంశంపై చర్చించుకుందామని చెప్పారు. ఇదే క్రమంలో ఆదివారం రాఘవులు, తమ్మినేని, చెరుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో జరిగిన సీపీఎం పోలిట్​బ్యూరో సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు పొత్తు, తమ గెలుపునకు అనుకూలంగా ఉండే స్థానాలు డిమాండ్​చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎం, సీపీఐ కార్యదర్శులిద్దరూ కాంగ్రెస్​తో పొత్తుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీపీఎం సైతం భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ స్థానాల నుంచి టిక్కెట్లు ఆశిస్తోంది. ఇందులో కాంగ్రెస్​ ఏయే స్థానాలకు కేటాయిస్తుందనే ఆసక్తి నెలకొన్నది.

‘పొత్తు’ చిచ్చు..!

ఇప్పటికే కమిటీలు, సీనియర్ల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు, టిక్కెట్లపై సర్వే అంశాల చిచ్చుతో సతమతమవుతోన్న టీపీసీసీకి కామ్రేడ్లతో పొత్తు.. పార్టీ​లో మరోచిచ్చు పెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తనకు టీపీసీసీ, ఏఐసీసీ ప్రకటించిన ఏ ఒక్క కమిటీలో చోటు దక్కలేదనే తీవ్ర అసంతృప్తితో ఉన్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​వచ్చే ఎన్నికల్లో తన సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉన్న హుస్నాబాద్​అసెంబ్లీ సెగ్మెంట్​నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్​నుంచి ఎమ్మెల్యే టిక్కెట్​ ఆశిస్తూ ఇటీవల గాంధీభవన్​లో దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఆదివారం కూనంనేనితో భేటీ అయిన మాణిక్​ రావ్​ఠాక్రే వారికి హుస్నాబాద్​ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ సీటు సీపీఐకి కేటాయిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతోన్న పొన్నం రాజకీయ భవిష్యత్​ఏంటనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. కాంగ్రెస్​రాష్ట్ర ఓబీసీ చైర్మన్​ఎడవెల్లి కృష్ణ, టీపీసీసీ సభ్యుడు నాగ సీతారాములతో పాటు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్​రెడ్డి సైతం కొత్తగూడెం నుంచి పోటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒకవేళ కాంగ్రెస్​తో పొత్తు కుదిరితే కొత్తగూడెం నుంచి కూనంనేని బరిలో ఉండడం ఖాయమవుతుంది. దీంతో ఇప్పటికే ఆ స్థానం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతోన్న ముగ్గురు కీలక నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

  • కలిసొచ్చే పార్టీతో పనిచేస్తాం
  • బీఆర్ఎస్​పొత్తు ధర్మం విస్మరించింది
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే నిర్దిష్టమైన ప్రతిపాదన వచ్చినప్పుడు మాత్రమే అన్ని రకాలుగా చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ తో పొత్తులు చెడినప్పటికీ తొందరపడాల్సిన అసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు ధర్మం విస్మరించిందని మండిపడ్డారు. విషకూటమైన బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని విమర్శించారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై చర్చించారు. కాంగ్రెస్ తో పొత్తులు, సీట్లు సర్దుబాటు తదితర అంశాలపై పార్టీలో సమీక్షించారు. సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. 

  • చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి 
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ముద్ర, తెలంగాణ బ్యూరో : సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తో చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు తెలిపారు. ఆదివారం టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాక్రేతో కూనంనేని చర్చలు జరిపారు. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలను సీపీఐ కోరుతోందని, అయితే రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కూనంనేని మాట్లాడుతూ తాము పోటీ చేయాలని భావిస్తున్న 4 స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తే కాంగ్రెస్ తో చర్చలు ముందుకు సాగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ముందు తేలాల్సి ఉందని కూనంనేని పేర్కొన్నారు.