బషీర్ బాగ్​కాల్పులు కేసీఆర్ చలవే!

బషీర్ బాగ్​కాల్పులు కేసీఆర్ చలవే!
  • ఉచిత కరెంట్ కుదరదని టీడీపీతో చెప్పించారు
  • కాళేశ్వరం అవినీతిపై బీజేపీ మౌనపాత్ర
  • గజ్వేల్​లో కేసీఆర్​ఓటమి ఖాయం
  • 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారు
  • మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : నగరంలోని బషీర్ బాగ్ లో 28 ఆగస్టు 2000న జరిగిన కాల్పులకు సీఎం కేసీఆరే బాధ్యుడని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్​ఇవ్వడం కుదరదని టీడీపీతో చెప్పించిన కేసీఆర్​నాడు రైతుల చావుకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. గాంధీభవన్​లో గురువారం మీడియాతో మాట్లాడిన రేవంత్​రెడ్డి కేసీఆర్​పై నిప్పులు చెరిగారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్​చేశారు. కేసీఆర్​నిజస్వరూపం బయటపడుతుందనే బీఆర్ఎస్​నేతలు నిరసనల డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అమెరికాలో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై కొందరు నిపుణులు అడిగిన ప్రశ్నలకు తాను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధివిధానాలను వివరించానన్నారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసిన బీఆర్ఎస్​నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. కేటీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. వ్యవసాయం తనకు పూర్తిగా తెలుసనీ, వ్యవసాయంలో ఇద్దరం పోటీ పడదామంటూ కేటీఆర్ కు సవాలు విసిరారు. కరీంనగర్ చౌరస్తాలో ఒకరు తనను ‘ఉరి తీస్తా’ అని మాట్లాడుతున్నాడంటూ మంత్రి గంగుల కమలాకర్​ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 24 గంటల విద్యుత్ పై గతంలో సీబీఐ విచారణ కోరిన బీజేపీ నాయకుడు లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. తనను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్న బీఆర్ఎస్​నేతలు మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్నారు. 

  • ఉచిత విద్యుత్ కాంగ్రెస్​పెటేంట్

టీడీపీ హయాంలో రైతుల పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ అధిష్టానం ఉచిత విద్యుత్ సహా రైతులపై నమోదైన అన్ని కేసుల కొట్టివేతకు హామీ ఇచ్చిందన్నారు. 2004లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం వైఎస్​రాజశేఖర్​రెడ్డి ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ తో పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు నష్టం జరగకుండా వినియోగం ఆధారంగా ఎక్కువ విద్యుత్‌ వచ్చేలా సోనియాగాంధీ చర్యలు తీసుకున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన పంచితే తెలంగాణకు 38 శాతం మాత్రమే విద్యుత్ దక్కేదని తెలిపారు. అందుకే జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ఆధారంగా కేటాయింపు జరిగిందన్నారు. ఇందులో తెలంగాణకు 53 శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్‌ కేటాయించారన్నారు.

  • ఉచితం పేరిట కేసీఆర్​దోపిడి

ఉచిత విద్యుత్ పేరుతో సీఎం కేసీఆర్ దోపిడికి పాల్పడుతున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. యేడాదికి రూ. ఎనిమిది వేల కోట్లు కాజేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా12 గంటలకు మించి విద్యుత్ సరఫరా కానప్పుడు రూ.16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫాంహౌస్ లు, భూములు ఉన్న ప్రాంతాలలో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నదని దన్నారు. పవర్ ప్లాంట్ల విషయంలో రూ. 45 వేల కోట్లకు టెండర్లు ఇచ్చి భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. రూ.2.60 పైసలకే విద్యుత్ ఇస్తామని  అప్పటి కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పినా, కేసీఆర్​వినకుండా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో ‘ఎ’ ప్లస్ గ్రేడ్ ఉన్న డిస్కంలు.. కేసీఆర్ పాలనలో ‘సి’ మైనస్ కు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

  • మోటార్లకు మీటర్లు

రాష్ట్రంలో 27.50 లక్షల మోటార్లకు ప్రభుత్వం మీటర్లు బిగించబోతోందన్న రేవంత్​రెడ్డి ఇది నిజం కాదని చెప్పడానికి ఎవరు ముందుకొస్తారో చెప్పాలని బీఆర్ఎస్​నేతలకు సవాలు విసిరారు. జూలై రెండున న ఖమ్మం సభతో తాము ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే, ఈ నెల 12న నిరసనలతో బీఆర్ఎస్​ఎన్నికల ప్రచారం ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్థి, ప్రతిపక్షం అని ఆ పార్టీ చేపట్టిన నిరసనలు, ధర్నాలతో తేలిపోయిందన్నారు. వచ్చే ఎన్నికలలో సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ఓడిపోతారన్నారు. 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలిందన్నారు.