ఏపీని ఆఫ్ట్రాల్​ తెలంగాణతో పొల్చొద్దు

ఏపీని ఆఫ్ట్రాల్​ తెలంగాణతో పొల్చొద్దు
  • అక్కడ చూసి రాతలు, కుంభకోణాలు
  • రాష్ట్ర విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స తీవ్ర వ్యాఖ్యలు
  • బొత్సపై ధ్వజమెత్తిన తెలంగాణ మినిస్టర్లు
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సబిత, గంగుల, శ్రీనివాస్​గౌడ్​వార్నింగ్​


ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్​విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్​ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ‘ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్​తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడ చూసి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తూనే ఉన్నాం. టీచర్ల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉంది’ అని అన్నారు. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమాలకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలను ఖండిస్తూ.. గట్టి కౌంటర్ ఇచ్చారు. 

  • రాజధాని కూడా లేని రాష్ట్రం ఏపీ..

రాజధాని కూడా లేని రాష్ట్రం ఏపీ అని, అలాంటి రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోందని మినిస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స మాట్లాడిన తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలను మరోసారి రెచ్చగొట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఒక బాధ్యత గల మినిస్టర్​గా ఆయన అలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో ఒక్కసారి బొత్స తెలుకుంటే మంచిదని సూచించారు. ఆయనచేత నీతులు చెప్పించుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. దేశానికే ఆదర్శంగా ఉన్న గురుకులాలు తెలంగాణలో ఎన్ని ఉన్నాయి.. ఏపీలో ఎన్ని ఉన్నాయని.. ఒకసారి బొత్స లెక్కలు తెప్పించుకోవాలని సూచించారు. గురుకులాలతో ఒక్క విద్యార్థిపై తెలంగాణ చేస్తున్న ఖర్చు, ఏపీలో చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసుకోవాలని అన్నారు. 

  • ఏపీలో స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గారు..?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ బడుల్లో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వ బడుల్లో రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగారన్నారు. అసలు ఏపీలో విద్యావ్యవస్థ ఉందా?  అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ స్కాంను బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బదిలీలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంతస్థాయి ఏపీ మంత్రికి లేదని విమర్శించారు. బొత్స  అవగాహన లేకుండా మాట్లాడడం తగదని అన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ విజన్ వల్ల ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని, తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో ఏపీ మంత్రులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోని ఐఐటీ, మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు సాధించిన ఫలితాలు బొత్స సత్యనారాయణకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.