ఐదు బ్రిడ్జిలకు కేటీఆర్ శంకుస్థాపన

ఐదు బ్రిడ్జిలకు కేటీఆర్ శంకుస్థాపన
  • రూ.168కోట్లతో వంతెనలు నిర్మించనున్న హెచ్ఎండీఏ
  • ఏడాదిన్నరలో వినియోగంలోకి రానున్న మూసీ వంతెనలు   

ముద్ర, తెలంగాణ బ్యూరో : నగరంలోని మూసీ, ఈసా నదులపై 5 వంతెనల నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​సోమవారం శంకుస్థాపన చేశారు. ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాతబస్తీకి మకుటాయమానంగా ఈ బ్రిడ్జీలను నిర్మిస్తామన్నారు. వీటి నిర్మాణంతో పాతబస్తీ మరింత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని, చార్మినార్ కు వచ్చే వారంతా ఇక్కడ రాకుండా వెళ్లరని పేర్కొన్నారు.  నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గ‌త  ప్రభుత్వాల తీరుతోనే..

గ‌త ప్రభుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికి కూపంగా మారిందని, ఇపుడు దాన్ని ఆహ్లాదంగా మార్చుతున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్తి అవుతాయని, హైద‌రాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాలన్నదే తమ అభిమతమన్నారు. శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం చేప‌డుతామ‌న్నారు. రూ.168 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఐదు బ్రిడ్జిలను నిర్మించనున్నదన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూసీ, ఈసా నదులపై పలు వంతెనలను ప్రతిపాదించిందన్నారు. ఈ రెండు నదులపై మొత్తం 14 బ్రిడ్జిలు నిర్మించనున్నా్మన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరికృష్ణ పాల్గొన్నారు.