ఈ పుస్తకం విలువెంతో తెలిస్తే... మీరు షాక్!
రూ. 11 కోట్ల పుస్తకం.. విమానంలో ఇంటికి చేరవేత
సాధారణంగా పుస్తకాల ధర ఎంత ఉంటుంది. వందల్లో.. కాకుంటే వేలల్లో... మరీ ఖరీదైనదంటే కొన్ని లక్షల రూపాయలు ఉండొచ్చు. మరీ ఈ పుస్తకం ఖరీదు ఎంతో తెలుసా? మన భారత కరెన్సీలో అక్షరాలా 11 కోట్ల రూపాయలు...ఈ పుస్తకం కొనుగోలు దారు దాన్ని కొనుగోలు చేయడానికి ఏకంగా ఒక ప్రైవేటు విమానంలో వెళ్లాడంటే నమ్మశక్యంగా లేదు కదూ... కాని ఇది ముమ్మాటికీ నిజం. ఈ పుస్తకం ఎవరు కొనుగోలు చేశారు? ఎందుకంత ఖరీదైనదన్న వివరాలు తెలుసుకుందాం.. ప్రైవేటు విమానంలో వెళ్లి మరీ ఈ పుస్తకం కొనుగోలు చేసిన అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారును ప్రశంసలతో ముంచెత్తుతోంది.
1925లో నెపోలియన్ హిల్ అనే అమెరికాకు చెందిన రచయిత ఈ పుస్తకాన్ని రాశారు. దీని పేరు “ది లా ఆఫ్ సక్సెస్”. దాదాపుగా వందేళ్ల క్రితం నాటి ఈ పుస్తకాన్ని అమెరికాలోని ఇడాహోలో నివసిస్తున్న వ్యాపారవేత్త రస్సెల్ బ్రుస్సన్స్ కొనుగోలు చేశారు. ఈ పుస్తకంలో నెపోలియన్ సంతకం చేసివుంది. డెయిలీ స్టార్ కథనం మేరకు.. ఈ పుస్తకం ఆన్ లైన్ లో విక్రయానికి వచ్చింది. నెపోలియన్ సంతకం చేసిన ఈ పుస్తకం మొదటికాపీని కొనుగోలు చేయాలని రస్సెల్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ పుస్తకం ధర 1.5 మిలియన డాలర్లుగా విక్రయదారు నిర్ణయించారు. మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపుగా 11 కోట్ల రూపాయలు. అందువల్ల ఎవరికి పడితే వారికి పుస్తకాన్ని విక్రయించడానికి దాని సొంతదారు అంగీకరించలేదు. రస్సెల్ దానిని కొంటానని చెబుతూ దాదాపు నెలరోజుల పాటు విక్రయదారును సంప్రదిస్తూ, ఆయనను వదల్లేదు. చివరికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పుస్తకం కొనుగోలుకు 11 కోట్ల రూపాయల మేరకు ఖర్చు పెట్టాలంటే, తన భార్యతోనూ సంప్రదించి చివరికి ఆమె అంగీకారాన్ని కూడా రస్సెల్ పొందగలిగాడు.
ప్రైవేట్ విమానంలో పుస్తకాన్ని ఇంటికి తెచ్చిన రస్సెల్
వ్యాపారవేత్త అయిన రస్సెల్ వద్ద నెపోలియన్ హిల్ పుస్తకాల పెద్ద సేకరణే ఉంది. ఆ రచయితకు చెందిన చాలా పుస్తకాలు కొన్నాడు. పుస్తకం తీసుకురావడానికి రూ.11 కోట్లు వెచ్చించాల్సి వస్తే కారులో వెళ్లడం ఎందుకు? విమానంలో వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఈ పుస్తకాన్నిచాలా జాగ్రత్తగా ఎక్కడా దుమ్ము, ధూళి సోకకుండా ప్రైవేట్ విమానంలో తీసుకువచ్చాడు.