అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం: అమెరికా

అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం: అమెరికా

వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్  భారత్‌లో అంతర్భాగమంటూ మనదేశానికి మద్దతుగా అమెరికా స్పందించింది.  సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని చైనా మార్చడానికి యత్నిస్తోందంటూ మండిపడింది. యూఎస్‌ సెనెట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానంలో సెనెటర్లు ఈ మేరకు ప్రస్తావించారు.  'ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా బెదిరింపులు కొనసాగుతోన్న తరుణంలో.. మా వ్యూహాత్మక భాగస్వాములకు అండగా నిలబడటం ఎంతో కీలకం. సెనెట్‌లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేస్తోన్న ప్రయత్నాలను ఖండిస్తోంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగం అని నిస్సందేహంగా గుర్తిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత కోసం అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని, క్వాడ్‌ను మెరుగుపరుచుతాం' అని ఆ తీర్మానం పేర్కొంది.
గత కొన్నేళ్లుగా భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో యూఎస్ నుంచి ఈ స్పందన వచ్చింది. చైనా, అరుణాచల్ ప్రదేశ్ మధ్య మెక్‌మోహన్ రేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా అమెరికా గుర్తిస్తోందని పునరుద్ఘాటించింది. ఇది పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్ చైనాలో భాగం కాదంటూ డ్రాగన్‌ వాదనలను తోసిపుచ్చింది. సరిహద్దు వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు మాండరిన్ భాష పేర్లతో మ్యాపుల ప్రచురణ వంటి చైనా చర్యలను ప్రస్తావించింది.