మా పాలన బాగుందా? సంక్షేమం ఎలా ఉంది! | Mudra News

మా పాలన బాగుందా? సంక్షేమం ఎలా ఉంది! | Mudra News
  • రాష్ట్రంలో సర్వే చేయిస్తున్న సర్కారు
  • గ్రామాలను చుట్టుముట్టిన బృందాలు
  • ఇంటింటికీ తిరిగి వివరాల సేకరణ
  • అమలులో ఉన్న పథకాల మీద ఆరా
  • ఇంకా కొత్తగా ఏం కావాలనుకుంటున్నారు?
  • ఎమ్మెల్యేల గురించి ఏమనుకుంటున్నారు?
  • ప్రభుత్వ పని తీరు మీదనే అసలు దృష్టి 
  • అటు ప్రభుత్వ సిబ్బంది.. ఇటు ప్రైవేటు సంస్థలు


ఆసరా పింఛన్లు ఎలా వస్తున్నాయి? నెలనెలా ఇస్తున్నారు కదా, పెన్షన్ల సొమ్మును పెంచి కేసీఆర్ సర్కారు పేదలను ఆదుకుంటోంది. దీనిపై గ్రామాలలో స్త్రమనుకుంటున్నారు? కల్యాణలక్ష్మి పథకం నిజమైనవాళ్లకే అందుతోందా? ఏమైనా ఫైరవీలు జరుగుతున్నాయా? అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా కమీషన్లు అడుగుతున్నారా? ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటున్నాయి? ఒకవేళ ఇంకా ఎలాంటి స్కీంలు ఇస్తే గ్రామాల జనాలకు లాభం జరుగుతుంది? రైతుబంధు గురించి రైతులు ఏమనుకుంటున్నారు? దళితబంధుకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఊరిలో ఎవరికైనా తొలి విడుతలో వచ్చిందా? దళితబంధు పథకాన్ని ఎలా తీసుకుంటున్నారు? 


ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పల్లెబాట పట్టింది. క్షేత్రస్థాయి సిబ్బందితో పాటుగా సర్వే సంస్థలన్నీ గ్రామాలను వడబోస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి? అవి ఎంత మందికి చేరాయి? వాటితో లబ్ధిదారులు ఏం చేస్తున్నారు? ఇంకా ఏం కావాలనపుకుంటున్నారు?   ప్రస్తుతం అమలు చేస్తున్న వాటితో పాటుగా ఇంకా ఎలాంటి పథకాలను తీసుకుంటే అధికార పార్టీకి కలిసి వస్తుంది? అనే వివరాల కూపీ లాగుతున్నారు. వేర్వేరుగా పలు అంశాలపై ఓవైపు నిఘా వర్గాలు, మరోవైపు సర్వే సంస్థలు పరిశీలనకు దిగాయి. అధికార పార్టీ తరపునే నాలుగైదు సంస్థలు గ్రామాలలో తిరుగుతున్నాయి. లబ్ధిదారుల జాబితాలు తీసుకుని పల్లె జనాన్ని పలకరిస్తున్నాయి. వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుని పైకి నివేదిస్తున్నాయి. 

పథకాలు అందుతున్నాయా?
ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లున్నారు? అందరూ స్థానికంగానే ఉంటున్నారా? కొత్త ఓటర్లు ఎవరైనా జాబితాలో చేరారా? సర్కారు పథకాలలో  మీకు ఏమేరకు లబ్ధి చేకూరింది?  సుమారు ఎంత మేరకు ఆర్థిక సాయం అందింది? అంటూ గ్రామాలలో వివరాలు సేకరిస్తున్నారు. అధికారికంగా ఆశ, అంగన్ వాడీ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది ఈ విషయాలపై ఆరా తీస్తుండగా, సర్వే సంస్థలు కూడా ఇంకో కోణంలో పరిశీలిస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ఎలాంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందని అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో మేనిఫెస్టో  కోసమే ఈ సర్వే చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా కేవలం ఫైరవీలు చేసిన వారికే వస్తున్నాయా? అనే కోణాలలో సర్వే చేస్తున్నారు. ఇటీవల దళితబంధు పథకంలో ఎమ్మెల్యేలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రతి పథకంపై సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఆసరా పింఛన్ల నుంచి మొదలుకుని అన్ని పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గ్రామాలలో ప్రభుత్వంపై ఎలాంటి పరిస్థితులున్నాయనే విషయాలను రాబడుతున్నారు. 

ఎన్నికల కోసమేనా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలలో అసంతృప్తిని పసిగట్టేందుకు నిర్వహిస్తున్న ఈ సర్వేకు గ్రామస్థాయిలో అంగన్ వాడీ, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బందిని వినియోగిస్తుండగా, ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే వివరాలను సర్వే సంస్థలు సేకరిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు తీరును ప్రభుత్వం అధ్యయనం చేయిస్తున్నది. ఫైలట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాను ముందుగా ఎంచుకోగా.. ఇప్పుడు పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లాలో కూడా సర్వే మొదలైంది. మండలస్థాయి అధికారులు సైతం దీనికి ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒక్కో అధికారికి కనీసం 100 కుటుంబాల నుంచి 300 కుటుంబాల వరకు బాధ్యతలను అప్పగించారు. 

వివరాలన్నీ సేకరణ
సమగ్ర వివరాలను తీసుకుంటున్నారు. ఫ్యామిలీలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? పాత జాబితాలో ఉన్నవారు స్థానికంగానే ఉంటున్నారా? ఎక్కడికైనా నివాసం మార్చారా? కొత్తగా ఓటర్లు చేరారా? ఇంట్లో ఎంత మందికి ఎలాంటి పథకాలు అందుతున్నాయి? సుమారు ఎంత మొత్తంలో వాటి ద్వారా ఆర్థిక సాయం అందుతున్నది? అనే వివరాలను సేకరిస్తున్నారు. రానున్న కాలంలో ఎలాంటి పథకాలు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇకపైన ఏం ఆశిస్తున్నారు? అలాంటి సాయం ఏ రూపంలో ఉండాలనుకుంటున్నారు? అనే అంశాలపైనా వివరాలు తీసుకుంటున్నారు. 

సర్కారుపై మీ ఉద్దేశ్యమేంది?
సర్కారు పథకాలపై వివరాలు తీసుకుంటున్న సిబ్బంది, సర్వే బృందాలు.. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఎలాంటి వైఖరి ఉంటుందో కూడా తెలుసుకుంటున్నారు. ముందుగా గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల స్థాయి నుంచి పనితీరుపై ఆరా తీసి, ఆ తర్వాత ఎమ్మెల్యేల వరకు ఎలా ఉంటున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, సంతృప్తి వంటి అన్ని వివరాలను ఏకకాలంలో తీసుకుంటున్నారు.