ప్రోటోకాల్ పాటించలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

ప్రోటోకాల్ పాటించలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
  • మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి
  • గతంలో ప్రారంభించిన పనులకే మళ్ళీ శిలాఫలకాలు
  • పట్నం అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలి
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం కరువు

ఇబ్రహీంపట్నం, ముద్ర: ప్రోటోకాల్ పాటించాలని కౌన్సిలర్ లు ఆందోళన చేస్తే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు.తుర్కయాంజాల్ మున్సిపల్ కేంద్రంలో కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన కలగానే మిగిలిపోయిందని మండిపడ్డారు. మున్సిపాలిటీలలో వందల కోట్ల ఆదాయాన్ని దండుకుని కేవలం రూ. 60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం దారుణం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు మాత్రమే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు అమలు చేయాలని అన్నారు. పోలీసులు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం ఇతర పార్టీల నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం కరువయ్యిందని మండిపడ్డారు. మహిళా కౌన్సిలర్ ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనుల్లో మున్సిపల్ పాలకవర్గాలను భాగస్వామ్యం చేసుకోవాలని హితవుపలికారు.

 ఈ సమావేశంలో జెడ్పీటీసీలు భూపతిగళ్ళ మహిపాల్, బింగి దాసు గౌడ్, హరిత ధనరాజ్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అనురాధ రాంరెడ్డి, కొత్త ఆర్థిక ప్రవీణ్, కౌన్సిలర్ లు కొసిగ అయిలయ్య, కాకుమాను సునీల్, ఉదయశ్రీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, నాయకులు గోపాల్, వెంకటేశ్వర్లు, అమృత సాగర్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.