ప్రశ్నా పత్రాల లీకేజీలో ప్రభుత్వం రికార్డుకెక్కింది

ప్రశ్నా పత్రాల లీకేజీలో ప్రభుత్వం రికార్డుకెక్కింది

 సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవాచేశారు. పాదయాత్ర లో మంగళవారం జైపూర్ మండలం గంగిపెళ్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి భట్టి మాట్లాడారు.   బీఆరెస్ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం గా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను నిర్వహించలేక అభాసుపాలు అయిన ప్రభుత్వం చివరకుపదో తరగతి పరీక్షలను సైతం సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందిందని ఆగ్రహించారు.  వరంగల్, తాండూరులో పదోతరగతి ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయని ఆయన తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పరీక్ష పత్రాలు మాయం కావడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ తో ఇప్పటికే నిరుద్యోగ అభ్యర్థులు నిరాశ నిష్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీతో  ప్రభుత్వం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీపై బాద్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. 

పాదయాత్రకు సంఘీభావం
 సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రకు  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం ఇన్చార్జి పీర్ల ఐలయ్యలు సంఘీభావం తెలిపారు. గంగిపెళ్లి నుంచి టేకుమట్ల వరకు భట్టి పాదయాత్రలో  వారు పాల్గొన్నారు.