ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మ- మంత్రి కేటీఆర్

ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మ- మంత్రి కేటీఆర్
  • ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మ
  • వాటిని ప్రధాని మోడీ ఆడిస్తున్నరు
  • తొమ్మిదేళ్లలో 95 శాతం విపక్షనేతలపై దాడులు
  • కవితకిచ్చినవి ఈడీ సమన్లు కావు, మోడీ సమన్లు
  • మండిపడిన మంత్రి కేటీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో: 
మోడీ సర్కార్ చేతిలో ఈడీ కీలుబొమ్మగా, సీబీఐ తోలుబొమ్మగా మారాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణభవన్​లో మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్, పువ్వాడ అజయ్​కుమార్​తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ పాలనా తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు జారీ చేసినవి ఈడీ సమన్లు కావని, మోడీ సమన్లని ఎద్దేవా చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలను జేబుసంస్థలుగా మార్చకున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతున్నందునే బీఆర్ఎస్​ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి,  శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి ఇళ్ల మీద దాడులు జరిగాయన్నారు. బీఆర్ఎస్  పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, లోక్ సభ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి,  శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మీద ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 12 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల దాడులు చేయించారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే.. అయితే జూమ్లా లేదంటే హమ్లా అని మండిపడ్డారు. నీతిలేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలు పర్యాయపదంగా మారాయన్నారు. ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి తప్ప ఈ తొమ్మిదేళ్లలో మోడీ సర్కార్ సాధించిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.

అదానీకి దోచిపెట్టలేదా?
గౌతమ్ అదానీ ఎవరి బినామో దేశంలో చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతాడని కేటీఆర్​ధ్వజమెత్తారు. నిబంధనలను తుంగలో తొక్కి అదానీకి ఆరు విమానాశ్రయాలు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  గుజరాత్ లో అదానీకి చెందిన ముంద్రా పోర్టులో మూడు వేల కిలోలు అంటే, దాదాపు రూ. 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. బీజేపీలో చేరగానే కేసులు వెంటనే పోతాయన్నారు. సుజనా చౌదరి బీజేపీలో చేరడంతో కేసులు నీరు గారిన విషయాన్ని గుర్తు చేశారు. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయించి,
మీడియా సంస్థలకు మోడీ వార్నింగ్​ ఇచ్చారన్నారు. శ్రీలంక ఆర్థిక మంత్రి అదానీకి శ్రీలంకకు మధ్య జరిగిన ఆరువేల కోట్ల ఒప్పందాన్ని జి టు జి ఒప్పందంగా పేర్కొన్నారని,  జి టు జి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు గౌతమ్ ఆదాని టు గొటబయ అని అర్థమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాల మీద పెట్టిన ఈడీ 5,422 కేసులు పెడితే 23 కేసులలో మాత్రమే తీర్పు వచ్చిందన్నారు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడన్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పాటిల్ ‘నేను బీజేపీలో చేరాను కాబట్టి నా మీదకు ఈడీ రాదు’ అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలోకి వెళ్లిన హర్షవర్ధన్ అనే ఎంపీ ‘హాయిగా నిద్రపోతున్నానని, ఈడీ నుంచి ఉపశమనం లభించిందని’ చెప్పారన్నారు.
 
దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చి 
మోడీ సర్కార్ దొడ్డిదారిన తొమ్మిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా ? అని కేటీఆర్​ ప్రశ్నించారు. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టిన పాపానికి ప్రాంతీయ పార్టీల నేతల మీద కేసుల పేరుతో వేధిస్తున్నది నిజం కాదా ? అని నిలదీశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ వేధింపులు కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి కాదా ?  అని మండిపడ్డారు.  ఆప్ సర్కార్ మీద కుట్రలో భాగంగానే మనీష్ సిసోడియా అరెస్ట్ అన్నది దేశ ప్రజలకు తెలుసన్నారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ పేరుతో మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతికి విసిగిపోయి కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నది నిజం కాదా ? చెప్పాలన్నారు. మాఫియాను న‌డిపించిన‌ట్టే మీడియా ను న‌డిపిస్తున్నారని విమర్శించారు. మీడియా సంస్థలంటే తమకు గైరవం ఉందని, కొన్ని సంస్థలను ఎలా, ఎప్పుడు బ్యాన్ చేయాలో తమకు తెలుసన్నారు