వీర వనితలు..

వీర వనితలు..
  • ఒకరిది అస్థిత్వం
  • మరొకరిది న్యాయం
  • ఇంకొకరిది నిజాయితీ 
  • జాతీయ మానవ హక్కులు, మహిళా కమిషన్​తలుపు తట్టిన ఇద్దరు

ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణలో ముగ్గురు మహిళల రాజీలేని పోరాటం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకరు తన అస్థిత్వ విలువల కోసం పోరాడుతుంటే, మరొకరు తనకు జరిగిన అన్యాయంపై ఏకంగా ఢిల్లీనే కదలించారు. పవిత్ర రాజకీయాలలో ఉంటూ నీతి తప్పిన తన తండ్రికి వ్యతిరేకంగా వేసిన ఇంకొకరు వేసిన ముందడుగు వర్తమాన రాజకీయాల డొల్లతనాన్ని తేటతెల్లం చేసింది. తెలంగాణ రాజకీయ యవనిక మీద ఈ  ముగ్గురు మహిళల పోరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపైనే కావడం గమనార్హం. వివిధ వర్గాలకు చెందిన ముగ్గురు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా తమ మొరని, ఫిర్యాదులను ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. కనీసం బాధితులతో సంప్రదించలేదు. అధిష్టానం తీరు చూస్తే.. ఆయా వివాదాల నుండి ఎమ్మెల్యేలను బయటపడే అవకాశాన్ని కలిపిస్తున్నదనే ప్రచారం జరుగుతోంది. పురుషాధిపత్యపు రాజకీయల మీద ముగ్గురు వనితల ధిక్కార స్వరం హాట్ టాపిక్​గా మారింది.

అస్థిత్వం కోసం

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపూర్ సర్పంచ్ కె.నవ్య తన అస్థిత్వ విలువల కోసం చేస్తున్న పోరాటం ఇప్పటికే రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్​కు చెందిన ఆమె స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మీడియాకెక్కారు. సమావేశాలలో చనువు తీసుకుంటూ భుజాల మీద చేతులు వేసేవాడని, అలా చేయవద్దని అభ్యర్ధించినా వినలేదని ఆరోపించారు. ఏకాంతంగా కలవాలని చెప్పేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న ఆమె అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అధిష్టానం నుండి స్పందన లేకపోవడంతో ఏకంగా జాతీయ మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. ఇదే క్రమంలో కొన్నాళ్లు తనకు అండగా నిలిచిన తన భర్తకు ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి నిధుల పేరుతో రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, రూ. 7 లక్షలు ఇచ్చాడని ఆరోపించారు. ఈ ఒప్పందం ప్రకారం తన వద్ద ఉన్న ఆధారాలను ధ్వంసం చేయాలని చూసిన తన భర్తపైనా ఆమె పోలీస్​స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. భర్త తోడు రాకున్నా... ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, ఆస్తిత్వ విలువల కోసం చేస్తున్న పోరాటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

కన్నతండ్రికే సవాల్

అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన తండ్రి చేసిన అవినీతిని ప్రశ్నించడమే కాకుండా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి యువతకు ఆదర్శంగా నిలిచారు. చేర్యాల మున్సిపాలిటీకి చెందిన మత్తడి భూమిని తన తండ్రి తన పేరిట రిజిస్ట్రేషన్​చేసినట్లు గుర్తించిన ఆమె ఆ భూమి దగ్గర మీడియా సమావేశం పెట్టి మరీ తన తండ్రి అవినీతిని ఎండగట్టారు. ‘వెయ్యి కోట్ల ఆస్తుంది ఆయనకి. నెలకి కోటిన్నర రెంట్లొస్తాయి మా తండ్రికి.  అటువంటి మనిషి ఈ భూమి తీసుకోకూడదు. రెండు సార్లు ఎమ్మెల్లే అయి వుండి 70 ఏళ్ల వయసులో చేయాల్సిన పని కాదు.  క్షమించండి. ఆ భూమిని మళ్లీ ఊరికే రాసిస్తాను’ అని బహిరంగంగా చెప్పారామె.  తాను తిరిగి కోర్ట్ ద్వారా ఆ భూమిని మునిసిపాలిటీకి తిరిగి ఇచ్చేయడమే కాకుండా ఆ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను స్వయంగా వెళ్లి కూల్చేశారు.

దేశ రాజధాని దాకా వెళ్లి

ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతోన్న ఆరిజన్​డెయిరీ డైరెక్టర్​శేజల్ పోరు సంచలనం సృష్టిస్తోంది. బాద్యతాయుత హోదాలో ఉంటూ వ్యాపారం గురించి చర్చిద్దామని పిలిచి తనను లైంగికంగా వేధించాడంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్​చేసిన ఆరోపణలు రాజకీయాలలో కలకలం రేపాయి. తనకు న్యాయం చేయాలంటూ తెలంగాణ పోలీసుల దగ్గరికి వెళితే తన వద్ద ఉన్న ఆధారాలన్నీ డిలీట్​చేశారంటూ ఆరోపించిన ఆమె ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు దిగి హల్​చల్​ చేశారు. అక్కడా న్యాయం జరిగే పరిస్థితులు కానరాకపోవడం, ఎమ్మెల్యే అనుచరుల నుండి బెదిరింపుల ఫోన్​కాల్స్​వస్తున్నాయంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చివరకు జాతీయ మానవ, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోంది.