కాంగ్రెస్ హిడెన్ ప్లాన్- అధికారమే అసలు టార్గెట్

కాంగ్రెస్ హిడెన్ ప్లాన్- అధికారమే అసలు టార్గెట్
  • సీఎం అభ్యర్థిగా సీతక్క పేరు
  • ఆరు నెలల క్రితమే ఏఐసీసీలో చర్చ
  • తాజాగా రేవంత్​నోటా అదే మాట
  • అంతా టీపీసీసీ వ్యూహంలో భాగమేనా?
  • ‘అగ్రవర్ణాలకే పదవులు’ అనే మచ్చను తుడిపేసుకునే యత్నం
  • పనిలో పనిగా నేతల విభేదాలకూ చెక్ పెట్టే యోచన
  • బీజేపీ, బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలనే భావన

ముద్ర, తెలంగాణ బ్యూరో :కాంగ్రెస్​సీఎం అభ్యర్ధిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరు మరోమారు తెరపైకొచ్చింది. అమెరికాలో జరిగిన తానా సభల ముగింపు వేడుకలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ‘అవసరమైతే సీతక్కను కాంగ్రెస్ తెలంగాణకు సీఎం చేస్తుందంటూ’ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ సంచలనం రేపాయి. నిజానికి ఆరు నెలల క్రితమే, టి– కాంగ్రెస్​లో వర్గ విభేదాలు భగ్గుమంటున్న సమయంలోనే సీతక్కను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే చర్చ జరిగిందనే టాక్ వినిపించింది. తర్వాత ఆమెకు కాంగ్రెస్​అత్యున్నత నిర్ణయాధికార కమిటీ సీడబ్ల్యూసీలో సభ్యురాలిగా అవకాశం కల్పిస్తారనే మాటలూ వినిపించాయి. అందుకు అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా సీతక్క పేరును ప్రతిపాదించారనే విషయం హాట్ టాపిక్​గా మారింది. తాజాగా అమెరికా వేదికగా రేవంత్​రెడ్డి సీతక్క పేరు మరోసారి లేవనెత్తారు. ఇది యాదృచ్ఛికం కాదని, కాంగ్రెస్​కావాలనే మీడియాకు ఇలా లీకులు ఇస్తోందనే చర్చ రాజకీయవర్గాలలో జోరుగా జరుగుతోంది. తెలంగాణలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్ లో బలపడుతున్న బీసీ నినాదం, ఇప్పటి వరకు పార్టీలోనూ,  ప్రభుత్వంలోనూ అగ్రవర్గాలకే పెద్దపీట వేశారనే అపవాదును దూరం చేసుకోవడం తదితర కారణాలతో అధిష్టానం కొత్త ఆలోచనలు చేస్తున్నదని సమాచారం. 

అందుకే ఈ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దళితుడినే సీఎం చేస్తానని మాటిచ్చి మోసం చేశారనే అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు. ఇటు బీజేపీ ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నిర్ణయించి ఆయా వర్గాల మద్దతు పొందే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో, వివాదరహితంగా ఉంటూ, నిజాయితీకి మారుపేరుగా నిలిచి, ప్రజాదరణ కలిగిన సీతక్కను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే జనంలో కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతుందని, పార్టీ గెలుపునకు కలిసి వస్తుందనే భావనలో ఆ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ లో కొంత మంది సీనియర్లు తాము సీఎం రేసులో ఉన్నామంటూ ప్రచారానికీ తెరలేపారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సీనియర్​నేత వి.హనుమంతరావు ఇప్పటి వరకు కాంగ్రెస్​లో అగ్రవర్ణాలే ఆధిపత్యం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఇటు పార్టీలో మెజార్టీ సీనియర్​నాయకులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వారిలో కొందరు తాము సీఎం రేసులో ఉన్నామని ఊహించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే ఆ సామాజిక వర్గనేతల మద్య అంతర్గత విభేదాలూ భగ్గుమంటున్నాయి. వీరిలో ఎవరినో ఒకరిని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే పార్టీలో అసమ్మతి పెరుగుతుందని భావిస్తున్న అధిష్టానం, బీసీ లేదా దళిత, గిరిజన నేతను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు తెలున్నది. కర్ణాటక ఎన్నికలలో బీసీ సామాజికవర్గానికి చెందిన సిద్ధరామయ్యకు సీఎంగా అవకాశమిచ్చిన కాంగ్రెస్​తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అనుసరించాలని అనుకుంటోంది. ఈ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్​సీతక్కను సీఎం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, సీతక్కను కాంగ్రెస్​సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే పార్టీలో మిగతా సీనియర్లు ఎలా స్పందిస్తారు? అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాన్ని స్వాగతిస్తారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.