నజరానా లేనట్టే!

నజరానా లేనట్టే!
  • 2,130 ఏకగ్రీవ జీపీలకు ఇప్పటికీ అందని ప్రోత్సాహకం
  • 2019లో రూ.10 లక్షలు ప్రకటించిన సీఎం కేసీఆర్
  • నాలుగేళ్లయినా నిధులు విడుదల చేయని సర్కారు
  • ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పాలకవర్గాల్లో నిరాశ
  • ‌పంచాయతీల్లో పడకేసిన అభివృద్ధి
     

రాష్ట్రంలోని జీపీల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే ప్రోత్సాహకంగా 10 లక్షలు ఇస్తాం. ఎన్నికల ఖర్చు లేదు. పోటీ అసలే ఉండదు. రాజకీయ వివాదాలకు ఆస్కారం లేకపోవడంతో వచ్చిన నిధులతో గ్రామాన్ని డెవలప్​చేసుకోవచ్చు’ అని సీఎం కేసీఆర్​2019లో ప్రకటించారు. మరోవైపు చాలాచోట్ల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతోపాటు తమ వంతుగా రూ.లక్షల్లో నజరానాలు ప్రకటించారు. దీంతో అదే ఏడాది జనవరిలో జరిగిన ఎలక్షన్లలో 2,130 జీపీల్లో సర్పంచ్​లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే నాలుగేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆయా జీపీలకు నిధులు రాలేదు. ప్రోత్సాహకాలు రాక పాలకవర్గాలు నిరాశలో మునిగిపోయారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. 


పాల డెయిరీ గదిలో పంచాయతీ ఆఫీస్​

వరంగల్​జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మారాన్ పేటలో 1,780 జనాభా ఉంటుంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికల హామీలో భాగంగా ఈ జీపీకి రూ.10లక్షల ప్రోత్సాహకం రావాలి. కానీ ఇప్పటికీ ఆ నజరానా అందలేదు. అలాగే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు రూ.20 లక్షల వ్యయంతో కొత్త భవనాలు నిర్మిస్తామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం తిమ్మారాన్​పేట పంచాయతీ సొంత భవనాన్ని కూల్చేసింది. ఇప్పటిదాకా ఆ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. దీంతో నాలుగేళ్ల నుంచి గ్రామంలో ఉన్న పాలశీతలీకరణ కేంద్రంలోని ఓ గదిని జీపీ ఆఫీస్​గా మార్చారు. ఉన్న ఒక్కగదిలో పాలకవర్గం సమావేశాల నిర్వహణ కష్టంగా మారింది. గ్రామంలో తారురోడ్డు, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రోత్సాహకంగా ఇస్తామన్న రూ.10లక్షలు రాకపోవడంతో జీపీలో అభివృద్ధి జరగడంలేదని పాలకవర్గ సభ్యులు వాపోతున్నారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు నజరానా రాకపోవడంతో నాలుగేళ్లుగా ఎదురుచూసిన పాలకవర్గ సభ్యులు నిరాశలో కూరుకుపోయారు. మరోవైపు జీపీకి నిధులు రాక అభివద్ధి పడకేసింది. పోటీ లేకపోవడంతో ఆయా జీపీల్లో ఎన్నికల ఖర్చు తగ్గడం, రాజకీయ వివాదాలకు ఆస్కారం లేకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రతీసారి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ క్రమంలో 2019 జనవరిలో 3 దఫాలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 2,130 గ్రామ జీపీలు ఏకగ్రీవమయ్యాయి. వీటితోపాటు 29,827 వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనాభా దామాషా ప్రకారం 5 వేల కంటే తక్కువగా ఉన్న జీపీలకు రూ.5లక్షలు, ఆపై జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎన్నికలు జరిగి నాలుగేళ్లు కావస్తున్నా ఇంత వరకు జీపీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు అందలేదు. 

కుంటుపడుతున్న అభివృద్ధి

ఒక్కో గ్రామ పంచాయతీకి కనీసం రూ. 5లక్షల చొప్పున లెక్కించినా 2,130 పంచాయతీలకు రూ.106.50 కోట్లు రావాల్సి ఉంది. అందని ప్రోత్సాహకాలతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సరిపోక ఆయా పాలకవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు అందుతున్నాయి. అయితే గతంలో ఆర్థిక సంఘం నిధుల కింద ఒక్కో జిల్లాకు రూ.12 కోట్ల చొప్పున వచ్చిన నిధులు ఇప్పుడు రూ.6 కోట్లకే పరిమితమయ్యాయి. ఇటు 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రావల్సిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ నిధుల్లో జనరల్ పద్దు కింద నిధులు రావడం లేదు. దీంతో అభివద్ధి కుంటుబడుతోంది. 2019 జనవరి 21, 25,30 తేదీల్లో రాష్ట్రంలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో తొలి విడతలో 769, రెండో విడతలో 783, మూడో విడతలో 573 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు జరిగాయి.

కొత్త జీపీల్లో పరిస్థితి మరీ దారుణం..

ఏకగ్రీవమైన పాత గ్రామ పంచాయతీలను అటుంచితే కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. 2018 ఆగస్టుకు ముందు రాష్ట్రంలో మొత్తం 8,368 జీపీలు ఉండగా అదేనెల 2వ తేదీన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4,383 కొత్త జీపీలను ఏర్పాటు చేసింది. వీటిలో 1,177 తండాలు కూడా పంచాయతీలుగా అవతరించాయి. దీంతో రాష్ట్రంలో జీపీల సంఖ్య 12,751కు చేరింది. ఇదే క్రమంలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దీంతో ఏకగ్రీవమైన పంచాయతీల్లో సమస్యలు తీరుతాయని అందరూ భావించారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో అభివద్ధి పరుగులు పెడుతుందని భావించారు. చాలాచోట్ల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతోపాటు తమ వంతుగా రూ.లక్షల్లో నజరానాలు ప్రకటించారు. ఎన్నికలు జరిగి నాలుగేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటి వరకు ఒక్క పంచాయతీకీ ప్రోత్సాహకం అందలేదు. కాగా ఇప్పటి వరకు సొంత భవనాలు, రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, వీధి దీపాలు లేని కొత్త పంచాయతీలు వందలాదిగా ఉన్నాయి. మరోవైపు ఏకగ్రీవమైన పంచాయతీల్లో సమస్యలు గుర్తించి.. వాటి పరిష్కారం కోసం అవసరమైన నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేసిన అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు మూడేళ్ల క్రితమే ప్రభుత్వానికి పంపారు. అయినా ఇంతవరకు చిల్లిగవ్వ కూడా అందలేదు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం, ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడడంతో ఏకగ్రీవ పంచాయతీలకు ఇక నిధులు రానట్టేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.