ఆ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలే 

ఆ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలే 
  • ఆ ముగ్గురు బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు
  • కుమారులు లేరని లోటు తీర్చారని ఆనందంలో తల్లిదండ్రులు
  • మొదటి సారిగా కలుసుకోవడంతో వేడుకలు చేసుకున్న ఉద్యోగులు 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-ప్రస్తుత సమాజంలో కన్న కొడుకులకు ఎక్కువ విలువనిస్తూ ఆడపిల్లలను మాత్రం కొంచెం తక్కువ స్థాయిలో చూస్తూ ఉన్న తల్లిదండ్రులను మనం చూస్తూనే ఉన్నాం ఆడపిల్ల అంటే ఇంటికి బరువు అని లక్షలాది కోట్లాది రూపాయలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందని ఆడపిల్ల అంటే ఏనాటికైనా ఆడనే కానీ ఇక్కడి పిల్ల కాదని ఒక నమ్మకంతో చాలామంది తల్లిదండ్రులు తమకున్న సంతానంలో ఆడ మగ పట్ల వివక్ష ప్రదర్శిస్తూ ఉండడం కొత్తవి కాదు కొడుకులను గొప్ప చదువులు చదివిస్తూ ఏనాటికైనా పెళ్లి చేసి పంపించాల్సిందేగా అంటూ అమ్మాయిలను మాత్రం తక్కువ చదువులు చదివిస్తూ లేదా మధ్యలోనే ఆపేస్తూ అమ్మాయిలపై ఖర్చులు దండగ అనే వ్యవహారంతో ఉన్నారని అనడంలో సందేహం లేదు అయితే కాలమాన పరిస్థితుల్లో ఈ ఆదిమ సమాజంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండి కుటుంబ పెద్దగా స్త్రీలే ఉండేవారు రాను రాను ప్రజల అభిప్రాయాల్లో ఆలోచనల్లో మార్పులు వచ్చి పితృ స్వామి వ్యవస్థ బలపడి మగాడు చెప్పిందే విధంగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు చదువుకోవడం కాదు కనీసం  గడప దాటి పోవాలంటేనే నిబంధనలు పెట్టే ఈ సమాజం పురుషుడితో పాటు స్త్రీలు కూడా దేనికి తీసుకోరని నిరూపిస్తూ  అన్నిట సగం అవకాశాల్లో సగం ఆకాశంలోనూ సగం ప్రతిదాంట్లో సగం మేము సగం మాకు అవకాశాలు సగం అంటూ పురుషులతో పోటీలు పడి విద్య ఉపాధి రంగాలలో మెజార్టీ భాగం దక్కించుకుంటున్నారు విద్యా ఉపాధి రంగాల్లో పురుషులు కంటే ముందంజలో మహిళలు ఉన్నారంటే ఆశ్చర్యము వేయ క మానదు. అలా తమకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని ఏనాడు బాధపడకుండా బాధ్యతగా చదివించిన తల్లిదండ్రుల కష్టానికి విలువనిస్తూ ఆ ముగ్గురు అక్క చెల్లెలు నేడు ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను నిలబెట్టిన సంగతి సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విషయంలో ముద్ర పత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం...

కుమారులు లేరని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఉన్న ముగ్గురు అమ్మాయిలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో కన్న తల్లిదండ్రులు ఆనందంలో తేలియాడుతున్నారు. తమ కష్టాలను మర్చి పోయే విధంగా  చేసిన ఆ అమ్మాయిలు తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన ముగ్గురు అమ్మాయిలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం గుడిమొల్కాపురం గ్రామానికి చెందిన బోదా లక్ష్మి చక్రారెడ్డి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. తమకున్న మూడు ఎకరాల భూమితో వ్యవసాయం చేస్తూ మధ్య తరగతి కుటుంబాన్ని పోషిస్తూ మగ పిల్లలు లేరనే బాధ లేకుండా తమకు కలిగిన ఆడపిల్లలు కష్టపడి చదివించారు.వారు కూడా తల్లిదండ్రుల కష్టం గుర్తించి ఎంతో కష్టపడి లక్ష్యంగా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పెద్దమ్మాయి మాధవి ఎంతో కష్టపడి చదివి ఎం ఏ ఏకనామిక్స్ పూర్తి చేసి  ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించింది. ఆమె ప్రస్తుతం హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది.రెండో అమ్మాయి స్వప్న బిఎస్సి నర్సింగ్ చదివి దుబాయిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తెలంగాణ లో ఇటీవల ప్రకటించిన ఉద్యోగంలో  స్టాఫ్ నర్స్ ఉద్యోగం పొందారు. ఆమె దుబాయ్ నుండి వచ్చి ప్రస్తుతం హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉంది.మూడో అమ్మాయి స్వాతి హైదరాబాదులో ఎం వి ఎస్ సి చదివి ప్రస్తుతం హైదరాబాదులో ప్రభుత్వ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆ ముగ్గురు అమ్మాయిలకు వివాహాలను కన్నుల పండువగా  చేపట్టారు.ఇటీవల ఉద్యోగం సాధించిన స్వప్న తో పాటు ముగ్గురు అమ్మాయిలకు ప్రభుత్వ  ఉద్యోగాలు వచ్చిన తర్వాత మొదటి సారిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులతో పాటు ముగ్గురు అమ్మాయిలు కూడా ఆనందం లోకంలో మునిగి పోయారు.ఈ సందర్బంగా శనివారం గుడి మొల్కాపురం లో పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొక్కులు చెల్లించుకొని వేడుకలు చేసుకున్నారు.పరిసర ప్రాంత ప్రజలు ముగ్గురు అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత మొదటిసారిగా రావడంతో వారి ఆనందం లో పాలుపంచుకున్నారు.ఈ సందర్భంగా పలువురు ఆ ముగ్గురు అమ్మాయి లను అభినందించారు.