ఎవరా అదృశ్య శక్తి!?

ఎవరా అదృశ్య శక్తి!?
  • షర్మిల రాక వెనుక ఉన్నదెవరు?
  • కలవరపడుతున్న టి– కాంగ్రెస్ శ్రేణులు
  • సీనియర్ నేతల నుంచి మిశ్రమ స్పందనలు
  • ఇప్పటికే షర్మిల చేరికను వ్యతిరేకించిన రేవంత్
  • అదే రకంగా వ్యాఖ్యానించిన వి. హనుమంతరావు
  • అయినా శరవేగంగా కదులుతున్న పావులు
  • కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నిర్ణయమే ఫైనల్?
  • అధిష్టానం తీరుపై పలువురు సీనియర్ల అసంతృప్తి
  • షర్మిల చేరిక కాంగ్రెస్ కు నష్టమే అంటున్న నేతలు
  • బీఆర్ఎస్, బీజేపీ అస్త్రంగా వాడుకుంటాయని ఆందోళన
  • నేడు హైకమాండ్ తో చర్చించాలని నిర్ణయం

షర్మిల కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకుంటే తెలంగాణలో పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ అని కొందరు కాంగ్రెస్​నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్​అధిష్టానం ఆంధ్రకు చెందిన షర్మిల డిమాండ్లకు తలొగ్గి తెలంగాణలో టిక్కెట్​ఇస్తే పరాయి రాష్ట్ర నేతల పెత్తనం పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్​ను ఓడించేందుకు ఇతర రాజకీయ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడగా, అందులో టీడీపీ కూడా జతకలిసింది. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీతో విపక్షాలు జత కలవడాన్ని సీఎం కేసీఆర్​తప్పుబట్టారు. ఆ ఎన్నికలలో ప్రచారానికి ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అది బీఆర్ఎస్​గెలుపుకు దోహదపడింది. 

షర్మిల వెనకున్నదెవరు!?

‌‌ఏపీ రాజకీయాలను వద్దనుకుంటున్న షర్మిల తెలంగాణలోనే తన రాజకీయ ప్రస్థానం ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారు? కాంగ్రెస్​అధిష్టానం షర్మిలకు ఎలాంటి అభయమిచ్చింది? ఆమెతో అధిష్టానం జరిపే చర్చలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి? అసలు ఆమె వెనక ఉన్న అదృశ్యశక్తులేవీ? అనే చర్చ తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. కాంగ్రెస్​లో షర్మిల చేరిక ఎన్నికలకు ముందు ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ టి– కాంగ్రెస్​నేతలలో నెలకొంది. వలసల పరంపర కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్​అధికారంలోకి ఖాయమనే భావనతో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్​ను దెబ్బకొట్టడానికి షర్మిలను తమ అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తాయనే ప్రచారం జరుగుతోంది.

ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు నెలకొన్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్​లో షర్మిల చేరిక అంశం తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఇప్పటికే ‘తెలంగాణలో ఆంధ్రకు చెందిన షర్మిల నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదన్న’ టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డిని కాదని బెంగుళూరులో డీకే శివకుమార్​తో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ కావడం, అందులో షర్మిల చేరికపై చర్చలు జరపడం కలకలం రేపింది. మరుసటి రోజే కాంగ్రెస్​లో వైఎస్సార్టీపీ విలీన అంశం కొలిక్కి వచ్చిందని, అందుకు అధిష్టానం ముందు షర్మిల పలు డిమాండ్లు పెట్టినట్లు జరిగిన ప్రచారం రాజకీయ దుమారాన్ని లేపింది. షర్మిల త్వరలోనే ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్​గాంధీతో భేటీ అవుతారనే ప్రచారం ఆ పార్టీ సీనియర్లకు మింగుడుపడడం లేదు. దీనిపై వీహెచ్​సైతం ఆమె ఏపీలో ఉంటేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఇంకొందరు సీనియర్లు సైతం టీ కాంగ్రెస్​లో షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు షర్మిల చేరికను సీనియర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే చర్చ హాట్​టాపిక్​గా మారింది. షర్మిల తెలంగాణలో పోటీకి దిగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అనుమానాలు టి–కాంగ్రెస్​ నేతలలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దూకుడు స్వభావం ఉన్న షర్మిల పార్టీలోకి వస్తే, ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు, సమర్థిస్తున్న నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతాయని కాంగ్రెస్ శ్రేణులే అంటున్నాయి. 

కాంగ్రెస్ ను బలహీనపరచడానికేనా?

2018 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కుదేలైన టి–కాంగ్రెస్. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్యంగా బలపడింది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతల చేరికలు దాదాపుగా ఖరారయ్యాయి. ఆయా పార్టీలకు చెందిన చాలా మంది నేతలు త్వరలోనే కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్​రావ్​ఠాక్రే, టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, ఇతర సీనియర్​నేతలు పలు సందర్భాలలో ప్రకటనలు చేశారు.  షర్మిల రాకను కొందరు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నా,  ఇంకొందరు సీనియర్లు అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలు తెలంగాణలో షర్మిల అవసరం ఏం వచ్చిందని, అసలు ఎవరో అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి స్వయంగా షర్మిల రాకను వ్యతిరేకించినా, అధిష్టానం మళ్లీ ఆమె విషయంలో ఎందుకింత సానుకూలంగా ఉందో అర్థం కాక సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ అధిష్టానం స్థానిక నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా షర్మిలను పార్టీలో చేర్చుకుంటే ఇప్పటికే ఆమె చేరికను వ్యతిరేకిస్తోన్న రేవంత్​రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలావుంటే.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్​రెడ్డి చేరికలకు సంబంధించి నేడు ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్​గాంధీతో భేటీ కానున్న టి– కాంగ్రెస్​నేతలు షర్మిల చేరిక అంశాన్నీ అధినేతలతో చర్చించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.