ఆషాఢం తర్వాతే అభ్యర్థుల జాబితా!

ఆషాఢం తర్వాతే అభ్యర్థుల జాబితా!
  • ముందుగా 50 నుంచి 70 స్థానాలకు క్యాండిడేట్ల ఖరారు?
  • మరో రెండు విడుతల్లో మిగతా సభ్యులు
  • నియోజకవర్గ సర్వే ఆధారంగా టిక్కెట్లు
  • అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆషాఢం తర్వాత ప్రకటించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీ అవుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా జాబితాను ప్రకటించడమేకాక ఎన్నికల ప్రచారాన్ని కూడా మరింత ముమ్మరం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ మేరకు నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల వడపోతను పలు దఫాలుగా పూర్తి చేశారు. 

నియోజకవర్గాలవారీగా సర్వే పూర్తి..

అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలుకావడంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలవారీగా సర్వేలు పూర్తి చేశారు. ఇందులో భాగంగా  ఎవరెవర్ని ఎక్కడి నుంచి పోటీకి దింపాలనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు. నియోజకవర్గ సర్వే ఆధారంగానే కేసీఆర్​అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే తొలి జాబితాను ఆషాఢం ముగిసిన వెంటనే  ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా స్థానాల్లో సిట్టింగులపై ప్రజల వైఖరి ఎలా ఉంది? వాళ్లు మళ్లీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి?  సిట్టింగులపై వ్యతిరేకత ఉంటే.. అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? తదితర అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. కేసీఆర్ కు వచ్చిన సర్వేల ఆధారంగా తొలి జాబితాలోనే 50 నుంచి 70  మందికి గ్రీన్​సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మిగిలిన స్థానాలను మరో రెండు జాబితాల్లో పూర్తి చేయనున్నారని సమాచారం. 

మొదటి జాబితాపై ఆశావహుల్లో చర్చ..

రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొదటి జాబితాలో ఉండేవారు ఎవరన్న అంశంపై పార్టీ వర్గాల్లోనూ, ఆశావహుల్లోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముందుగానే  టిక్కెట్లు ప్రకటించడం ద్వారా వాళ్లను పూర్తిస్థాయిలో నియోజవర్గాలకే పరిమితం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికల నాటికి పోటీ చేసే స్థానంపై పూర్తిస్థాయి పట్టు సాధించడం ద్వారా అధిక మెజార్టీతో గెలిపించుకోవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంటే.. మొదటి విడతలో టిక్కెట్లు పొందిన అభ్యర్థులకు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఫోకస్ పెట్టడానికి కనీసం నాలుగు నెలల సమయం దొరుకుతుంది. కొద్దో గొప్పో వ్యతిరేకత ఉన్నా.. త్వరగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దాన్ని అధిగమించవచ్చన్న ఆలోచనతో సీఎం ఉన్నారు. 

మిగతా అభ్యర్థుల సంగతేంటి ?

జూలైలో 70  మంది అభ్యర్థులను ప్రకటించాలనుకుంటున్న కేసీఆర్.. కొంత గ్యాప్ తీసుకుని మిగతా 49 నియోజకవర్గాలకు అభ్యర్థులను  మరో రెండు విడతల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 49 స్థానాలపై కేసీఆర్ ఆచితూచి స్పందించే  అవకాశం కనిపిస్తోంది. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 10 నుంచి -20 స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం. వామపక్షాలతోపాటు ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే వాళ్లకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ఈ 49 స్థానాలపై కేసీఆర్ మరో సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.