నేడు, రేపు కేసీఆర్​ మహారాష్ట్ర టూర్

నేడు, రేపు కేసీఆర్​ మహారాష్ట్ర టూర్
  • తెలంగాణ వలస చేనేత కుటుంబాలతో భేటీ
  • బీఆర్ఎస్​లో చేరనున్న పలువురు నేతలు
  • మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు సీఎం ప్రణాళికలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్రపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో పార్టీని వేగంగా విస్తరించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి 2 రోజులపాటు సీఎం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన సందర్భంగా వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు, వారి అనుచరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటివరకు సీఎం నాలుగుసార్లు మహారాష్ట్రలో పర్యటించారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన రోడ్డు మార్గం గుండా వెళ్లనున్నారు.

షోలాపూర్​లో బస..

సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు కేసీఆర్ బయలుదేరి రాత్రికి షోలాపూర్ లో బస చేస్తారు. షోలాపూర్ లో స్థానిక రాజకీయ నేత భగీరథ్ బాల్కే సీఎం సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలతో కేసీఆర్ భేటీ కానున్నారు. 27వ తేదీ ఉదయం పండరీపూర్ లో విఠోబా రుక్మిణి ఆలయంలో ఆయన పూజలు చేస్తారు. తర్వాత దారాశివ్ జిల్లాలోని తుల్జా భవానీ అమ్మవారి శక్తి పీఠాన్ని కేసీఆర్ సందర్శించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. కాగా ఇప్పటికే మహారాష్ట్రలో కేసీఆర్ పలు సభలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం నాగ్ పూర్ లో పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించారు. త్వరలో ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ  ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్​ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయటంతోపాటు పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసే పనిలో పడింది.