కేరళ స్టోరీ ఓ 'ప్రాపగండా' సినిమా

కేరళ స్టోరీ ఓ 'ప్రాపగండా' సినిమా

ప్రముఖ రచయిత వీకే  చెరియన్ విశ్లేషణ

హైదరాబాద్: 'కేరళ స్టోరీ' ప్రచారపు (ప్రాపగండా) సినిమాల కోవ లోకి వస్తుందని, ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ సినిమా తీశారని ప్రముఖ రచయిత, ఇండియన్ ఫిలిం సొసైటీకి చెందిన ప్రముఖుడు వి.కే. చెరియన్ వ్యాఖ్యానించారు. జర్మనీ నియంత హిట్లర్ వ్యాఖ్యానాలు, ప్రసంగాలతో కూడిన 'ది గ్రేట్ డిక్టేటర్' సినిమా అలాంటి కోవలోకే వస్తుందని  చెరియన్ చెప్పారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్,  ఇండియా (మెఫి) ఆధ్వర్యంలో గురువారంనాడు  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. మెఫి చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

కేరళ నుంచి 32 వేల మంది యువతులు అదృశ్యమైన నేపథ్యంలో ఈ సినిమా తీశామని నిర్మాతలు మొదట చెప్పుకున్నారని, తీరా సినిమా కోర్టుకు వెళ్లేసరికి ఇది ముగ్గురు యువతుల కిడ్నాప్ కు సంబంధించిన కల్పిత గాథ అని సంజాయిషీ ఇచ్చుకున్నారని ఆయన తెలిపారు. కేరళ నుంచి అదృశ్యమైన యువతుల ఆచూకీ తెలియకుండా పోయిందన్న ప్రచారం గురించి ప్రస్తావిస్తూ  క్రైమ్ రికార్డులను వెలికితీయగా అది అవాస్తవమని తేలిందని ఆయన చెప్పారు. అపహరణ కేసులలో ఆచూకీ కనుగొన్న కేసుల శాతం జాతీయ స్థాయిలో 50 శాతం ఉండగా కేరళలో అది 86 శాతం ఉందని చెరియన్  వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇది నాలుగు శాతం మాత్రమేనని ఆయన తెలిపారు.  ఈ సినిమాను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం దానికి వినోదపు పన్ను మినహాయించి ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని అయన వ్యాఖ్యానించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ సినిమా గురించి సానుకూలమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన మాట వాస్తవమేనని అయితే కేరళ ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ ఆ సినిమాను అస్సలు పట్టించుకోనేలేదని చెరియన్ చెప్పారు. కేరళ స్టోరీ వంటి ప్రాపగండా సినిమాలు తీయడం ఇది కొత్త కాదని వంద సంవత్సరాల ముందు నుంచే ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయని పేర్లతో సహా ఆయన వివరించారు. సీనియర్ జర్నలిస్టులు అడిగిన పలు  ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ సినిమాలోని రాజకీయాల్లోకి తాను వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు. అయితే సంఘ్ పరివార్ సిద్ధాంతాలతో గత కొద్ది కాలంగా సినిమాలు వస్తున్నాయని అంటూ కేరళ స్టోరీ అందులో చివరిది కాబోదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రజలలో విద్వేషాలను రెచ్చగొట్టే కేరళ స్టోరీ వంటి చిత్రాలను నియంత్రించే యంత్రాంగం లేదా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఉంది కదా' అని ఆయన అన్నారు. ప్రజల విచక్షణను, దాని శక్తిని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని ఆయన వ్యాఖ్యానించారు. మెఫీ ట్రస్టీ, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి తొలుత స్వాగతం పలుకగా, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ వందన సమర్పణ చేశారు.  ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం.ఏ.మాజీద్, టీయూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, హెచ్.యు.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్, సీనియర్ జర్నలిస్టులు సోమ్ శేఖర్, డి. జగన్నాధరావు, పలువురు  ప్రజాస్వామికవాదులు పాల్గొన్నారు.