వీధీ వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో టాప్‌లో తెలంగాణ‌

వీధీ వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో టాప్‌లో తెలంగాణ‌
  • కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మున్సిప‌ల్ అధికారులు
  • రూ.695 కోట్ల రుణాన్ని అందించిన తెలంగాణ 
ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం మరో సారి అగ్రస్థానంలో నిలిచింది. వీధీ వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో పెద్ద రాష్ట్రాల కేట‌గిరిలో టాప్ గా నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప‌ట్టణాభివృద్ధి శాఖ మంత్రి ‌హిర్దిప్ సింగ్ పూరి చేతుల మీదిగా అవార్డు అందుకున్నారు. రాష్ట్ర  ప్రభుత్వ త‌రుఫున మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్యలు ఈ అవార్డును అందుకున్నారు.ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అధికారుల‌ను కేంద్ర మంత్రి అభినందించారు. దేశంలో పెద్ద రాష్ట్రాల కేట‌గిరిలో తెలంగాణ‌, మ‌ధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు అవార్డులను అందించారు.  వీధి వ్యాపారుల‌కు రుణాలు ఇచ్చే పీఎంస్వాన్ నిధి ప్రారంభించి మూడు సంవ‌త్సరాలు అయిన సంద‌ర్భంగా గురువారం ఢిల్లీలో జ‌రిగిన కార్యక్రమంలో  ఈ అవార్డును అందించారు.
పట్టణ ప్రగతిలో భాగంగా  వీధి వ్యాపారుల అభివృద్ధి, వారికి మౌలిక స‌దుపాయాల క‌ల్పించాల‌ని  సిఎం కెసిఆర్ మూడేళ్ల కిందట ఆదేశించారు. అదే సమయంలో వీధి వ్యాపారులు,  వారికి  స్ట్రీట్ వెండింగ్ జోన్‌లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. కరోనా కారణంగా  వీధి వ్యాపారులు ఆర్ధికంగా  తీవ్రంగా దెబ్బతినడంతో వాకరికిచ్చే  రుణాల‌పై స్టాంప్ డ్యూటీని మిన‌హాయించాలని రాష్ట్ర  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే నష్టపోయిన వీధి వ్యాపారుల‌కు మొద‌టి విడ‌త‌లో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రుణం అందించారు. మొద‌టి విడ‌త‌లో 3.40 లక్షల మందికి వీధి వ్యాపారుల‌కు రుణాలు ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 3,58,776 (106శాతం) వీధి వ్యాపారుల‌కు రుణాలు మంజూరు కాగా 3,56,678 మందికి రూ.353.17(105శాతం) కోట్లను పంపిణి చేశారు. మొద‌టి విడ‌త రుణాల పంపిణిలో 100 శాతం ల‌క్ష్యాన్ని చేరి తెలంగాణ దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింది. 
టాప్‌లో  రాష్ట్ర ప‌ట్టణాలు..
ల‌క్ష జ‌నాభా ఉన్న ప‌ట్టణాల కేట‌గిరిలో దేశ వ్యాప్తంగా 3555 ప‌ట్టణాలు ఉండ‌గా ఈ కేట‌గిరిలో టాప్ 10కు 10 ప‌ట్టణాలు రాష్ట్రంలోనే ఉండడం విశేషం. మొద‌టి స్థానంలో సిద్దిపేట‌, రెండో స్థానంలో సిరిసిల్ల, తరువాతి స్థానాల్లో నిర్మల్, కామారెడ్డి, బోధ‌న్‌, జ‌హీరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల‌, పాల్వంచ‌, ఆర్మూర్ ప‌ట్టణాలు టాప్ 10లో నిలిచాయి.  లక్ష నుంచి 10 ల‌క్షల జ‌నాభా కేట‌గిరిలో దేశంలో 442 ప‌ట్టణాలు ఉండ‌గా వ‌రంగ‌ల్‌లో దేశంలోనే మొద‌టి స్థానంలో ఉండ‌గా, నిజామాబాద్ 10వ స్థానంలో ఉంది. 40 లక్షల పైగా ఉన్న జ‌నాభా కేట‌గిరిలో జీహెచ్ఎంసీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.  ఇక రెండో విడ‌త రుణాల పంపిణిలో భాగంగా మొద‌టి విడ‌త రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఒక్కొక్క వీధి వ్యాపారికి రూ.20వేలు అందించారు. 1,45,100 మందికి రుణాలు అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా 1,53,306 మందికి(106శాతం) మంజూరు చేశారు. ఇందులో 1,46,692 (101శాతం) రుణాల‌ను పంపిణి చేశారు. 
ఇలా వీధి వ్యాపారుల‌కు మూడు విడుత‌ల్లో ఇప్పటి  వ‌ర‌కు రూ.695.42కోట్ల ను పంపిణి పూర్తి అయ్యాయి. రెగ్యుల‌ర్ రుణాలు చెల్లించిన వారికి తిరిగి వారికి ఆ రుణాన్ని బ్యాంకులు వారి అకౌంట్లో జ‌మ చేశాయి. ఇలా తెలంగాణ‌లోని వీధి వ్యాపారుల‌కు రూ.10.70కోట్లు జ‌మ అయ్యాయి. మూడో విడ‌త రుణాల్లో భాగంగా 20వేల రుణాన్ని తీసుకొని చెల్లించిన వారికి రూ.50వేల‌ను మూడోవిడ‌త‌లో అందించారు. 3870 మందికి రుణాలు అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా 10,661 మందికి(275శాతం) రుణాలు మంజూరు చేశారు. 10058(260శాతం) మందికి రూ.49.64కోట్లు పంపిణి చేశారు.  కాగా రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల‌కు  రుణాలు అందించ‌డ‌మే కాదు వారు వ్యాపారాలు చేసుకోవ‌డానికి అనువుగా స్ట్రీట్ వెండింగ్ జోన్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వ‌ర‌కు 2676 స్ట్రీట్ వెండింగ్ షెడ్స్ నిర్మించాల‌ని నిర్మయించారు. ఇందులో 1294 పూర్తి అయ్యాయి. మిగిలిన 1382 నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.