తెలంగాణ ఐటి విధానాలు, పాలసీలు భేష్

తెలంగాణ ఐటి విధానాలు, పాలసీలు భేష్
  • ప్రశంసలు కురిపించిన తమిళనాడు రాష్ట్ర బృందం
  • తెలంగాణ ఐటి  కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు వచ్చిన తమిళనాడు ఐటి మంత్రి పిటిఆర్
  • సచివాలయంలో తమిళనాడు  బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందజేసిన మంత్రి కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో: ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటి పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పిటిఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ కు చేరుకున్న మంత్రి పిటిఆర్ బృందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సచివాలయంలో సమావేశం అయ్యింది. రాష్ట్ర ఐటీ ప్రగతిపైన, అందుకు దోహదం చేసిన అంశాలపైన అధ్యయనం చేసేందుకు తాము తెలంగాణలో పర్యటిస్తున్నామని పిటి ఆర్ తెలిపారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటి పాలసీ, ఐటీ అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తమిళనాడు మంత్రి బృందానికి  ఈ  సందర్భంగాకేటిఆర్ వివరించారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు  ఐటీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని,  అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఐటి  పరిశ్రమ వేగంగా వృద్ధి చెందిందన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం ఐటి పరిశ్రమకు అనేక విధాలుగా మద్దతు అందించడం ద్వారా  దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటి నగరంగా హైదరాబాద్ మారిందని కేటీఆర్ తెలిపారు. ఐటితోపాటు దాని అనుబంధ రంగాలకు ప్రత్యేకంగా ఒక పాలసీని తయారు చేశామన్నారు. తాము పాలసీలను రూపొందించే క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలతోపాటు పరిశ్రమలో ఉన్న భాగస్వాముల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకున్నామని, వారికి ఎలాంటి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందో తెలుసుకొని వాటన్నింటినీ తమ పాలసీల్లో పొందుపరిచామన్నారు.

హైదరాబాద్ నగరం ఐటి పరిశ్రమకు అత్యంత కీలకమన్న విషయాన్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం,  ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టామని తెలిపారు. రాష్ట్రానికి నూతనంగా పెట్టుబడులు తీసుకురావడాన్ని,  అత్యంత ప్రాధాన్య అంశంగా నిర్ధారించుకున్నప్పటికీ,  తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలతోనూ స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకొని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించామని కేటీఆర్ తెలిపారు. దీంతో అప్పటిదాకా హైదరాబాద్ నగరంలో పరిమిత కార్యకలాపాలు నిర్వహిస్తున్న, గూగుల్, అమెజాన్, ,  సర్వీస్ నౌ తధితర దిగ్గజ  కంపెనీలు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద లేదా రెండవ అతిపెద్ద కార్యాలయాలకు కేంద్రంగా మార్చుకున్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఐటీ శాఖ ద్వారా రాష్ట్రంలోని  యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం మేరకు తాము పని చేశామని తెలిపిన కేటీఆర్, మరోవైపు ఐటీ శాఖ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పౌరులకు మరిన్ని సేవలు అందించే విషయంలో కూడా అత్యంత  చొరవ చూపమన్నారు. ఈ మేరకు ప్రభుత్వం విధానాల వలన ఆన్ లైన్ సేవలు, మొబైల్ సేవలు, డిజిటల్ సేవల్లో తెలంగాణ అనేక అంశాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సాంకేతికత ఆధారిత పౌర సేవల వివరాలను అందించారు. హైదరాబాద్ నగరం తో పాటు రెండవ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట లాంటి పట్టణాలలో ఐటి టవర్లను పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేశామని, ఈ ఐటీ టవర్లలో టాస్క్, టీహబ్, విహబ్ వంటి ఉప కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక విద్యావంతులకు శిక్షణ ఇచ్చేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ఐటి కంపెనీల నుంచి మంచి స్పందన వస్తుందని, ఇప్పటికే వందల సంఖ్యలో ద్వితీయ శ్రేణి నగరాల్లో యువతకు ఉద్యోగాలు అందించే దిశగా ముందుకుసాగుతున్నామని తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన విషయాలన్నింటి గురించి సావధానంగా తెలుసుకున్న మంత్రి పిటిఆర్ బృందం  రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలసీలపైన ప్రశంసలు కురిపించారు. నూతనంగా తమిళనాడు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన  ఉపయుక్తంగా ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  ఇక్కడి ఆదర్శవంతమైన విధానాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ ఎదుగుతున్న తీరు అద్భుతం అని ప్రశంసించిన పిటిఆర్, తెలంగాణ రాష్ట్రం ఐటి శాఖ ద్వారా చేపట్టిన అనేక ఇతర కార్యక్రమాలు కూడా తమకు స్ఫూర్తినిచ్చాయని  తెలిపారు. తమ పర్యటనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న,  తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.  కాగా మంత్రి పిటిఆర్ బృందం శుక్రవారం కూడా విస్తృతంగా తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలను  అధ్యయనం చేయనుంది.