దొరల పాలన అంతం చేయాలి

దొరల పాలన అంతం చేయాలి

బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌‌

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: తెలంగాణలో దొరల పాలన అంతం చేసి బహుజనుల అధికారాన్ని స్థాపించుకోవాలని బీఎస్పీ చీఫ్ కుమార్ పిలుపునిచ్చారు. బి ఎస్ పి చేపట్టిన రాజ్యాధికార యాత్ర 251 రోజులు 42 నియోజకవర్గాల్లో పూర్తిచేసుకుని గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జనాభాలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు ఏకమై వచ్చే ఎన్నికల్లో 9 శాతం ఉన్న దొరలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. లింగాల గణపురం మండలం కళ్లెంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించిన 400 ఎకరాల భూములలో ఎన్ని పరిశ్రమలు పెట్టి ఎంత మందికి ఉపాధి కల్పించాలని ప్రశ్నించారు.

దళితుల పేరు ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వ పెద్దలు లాక్కొని వేల కోట్లు దండుకొని పేదలకు 500 గజాల స్థలాన్ని అప్పచెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగ భద్రత కల్పించలేదు, ప్రభుత్వ పాఠశాలలో, గురుకులాలలో వసతులు లేక విద్యావ్యవస్థ బ్రష్టు పట్టిందన్నారు. రియల్ ఎస్టేట్లు, ఇసుక మాఫియాలో ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రకరకాల పథకాలను ప్రకటించి ప్రజల్ని మోసగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపితో రహస్య ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపిలను చిత్తుగా ఓడించి బి ఎస్ పి ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటస్వామి అధ్యక్షతన బిఎస్పీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది.

జిపి కార్మికులను పర్మినెంట్ చేయాలి..
ఉత్తరప్రదేశ్ తరహాలో గ్రామపంచాయతీ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న 15వ రోజు సమ్మెకు ఆయన తన అనుచరులతో మద్దతు ప్రకటించారు. ఆయన వెంట బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటస్వామి జేఏసీ నాయకులు కండలోజు రాజు, రావుల జగన్నాథం, కుంభం రాజు, జీడి ఆనందం, చిరంజీవి, గూడూరు భాస్కర్, బోసు రాజు తదితరులు ఉన్నారు.